కంటోన్మెంట్, జూలై 12: కంటోన్మెంట్లో భూ బదిలీ పరిహార సొమ్ముపై పార్టీల మధ్య క్రెడిట్ వార్ జరుగుతున్నది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పరిహారం కింద రక్షణ శాఖకు సుమారు రూ. 303. 62 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయా పార్టీల విజ్ఞప్తి మేరకు కేంద్ర రక్షణ శాఖ స్థానికంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో రూ. 303. 62కోట్లను జమ చేయడంతో తమ పార్టీల పోరాటంతోనే బోర్డుకు నిధులు వచ్చాయంటూ హస్తం, కమలం పార్టీల నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు. బోర్డు ఖాతాలో జమ అయిన నిధుల తోటి బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉండగా, కీచులాటలతో రచ్చకెక్కుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో..
ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు రవాణా సౌకర్యార్థం కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాల కోసం ముందడుగు వేశారు. కేసీఆర్ ప్రభుత్వం కంటోన్మెంట్ భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాలని దీనికి బదులు భూ బదలాయింపు తో పాటు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. పదేండ్లుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కేంద్ర రక్షణ శాఖ ఎలాంటి చొరవ తీసుకోకుండా చోద్యం చూస్తూ వచ్చింది.
అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి అప్పటి కేంద్ర మంత్రులకు స్కై వేలకు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని అనేకసార్లు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ ఇటీవల కాలంలో కంటోన్మెంట్ భూములను అప్పగించేందుకు ముందుకు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పరిహార సొమ్మును రక్షణ శాఖకు చెల్లించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కంటోన్మెంట్ భూములకు సంబంధించిన పరిహార సొమ్మును కంటోన్మెంట్ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే రక్షణ శాఖ మూడు రోజుల కిందట పరిహారపు సొమ్మును కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో జమ చేయడం గమనార్హం.
ఆలోచన లేకుంటే నిధులు ఎక్కడివి..
గత కేసీఆర్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ఆలోచన లేకుంటే బోర్డుకు నిధులు వచ్చేవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించాలని ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగానే నేడు కంటోన్మెంట్ బోర్డుకు నిధులు వచ్చాయని, ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు అజ్ఞానపు మాటలతో బోర్డు పరిధిలోని ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మేలు కోసం పనిచేయకుండా పదేళ్ల పాటు కాలయాపన చేస్తూ వచ్చి, కాంగ్రెస్, బీజేపీ ఒకటేనన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బోర్డుకు నిధులు జమ కావడంలో తమ పోరాటమే ఉందంటూ గొప్పలు చెప్పుకొంటున్నాయి.
సర్వీస్ చార్జీలు ఎక్కడ….?
బోర్డుకు నిధులు జమ కావడంలో తమ గొప్పే అని చెప్పుకొంటున్న కాషాయం పార్టీ సర్వీస్ చార్జీలు సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా బోర్డుకు రావాల్సి ఉన్నా..నోరు మెదపడం లేదు. పరిహార సొమ్ముకు సంబంధించి నిధులు రాగానే మాత్రం తమ పోరాటం అని చెప్పుకొనే కమలం నేతలు బోర్డుకు బకాయి ఉన్న నిధులపై కేంద్రాన్ని నిలదీయక పోవడం ఏమిటని కంటోన్మెంట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. బకాయి నిధులు బోర్డుకు వస్తే కంటోన్మెంట్ రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడుతున్నారు.
6వేల ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ..?
పరిహార సొమ్ము రక్షణ శాఖకు ఇచ్చి తామే అంతా చేశామంటూ గొప్పలు చెబుతున్న హస్తం నేతలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉప ఎన్నికల సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్టంలోనే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక్క ఏడాదిలోనే 6వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామంటూ ఊదరగొట్టారు. కానీ రాష్టం మొత్తం అక్కడక్కడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిపాజజ కంటోన్మెంట్ లో మాత్రం కనీసం ఆ ఊసే లేకపోవడం విశేషం.