సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రూ.2.9 కోట్లు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. లక్డీకాపూల్‌లో మదస్ కుమార్ కొంతకాలంగా రియాన్ వీసా ఇమ్మిగ్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు ఇప్పిస్తామంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన గండిపేట నివాసి జగన్నాథ్ రామ్ లక్డీకాపూల్‌లో ఉన్న కన్సల్టెన్సీని సంప్రదించాడు. కెనడాలో ఉద్యోగం కావాలంటూ మదస్ కుమార్ అడిగాడు. కెనడాతో పాటు ఇతర దేశాలకు ఉద్యోగాలు, చదువుకోడానికి వెళ్లేవారికి వీసా ప్రాసెసింగ్ చేస్తానంటూ చెప్పాడు. దీంతో బాధితుడు తనకు కెనడాలో ఉద్యోగం చేయాలని ఉందంటూ చెప్పడంతో తప్పని సరిగా ఉద్యోగం ఇప్పిస్తామని, ఫుడ్ సూపర్వైజర్ ఉద్యోగం ఉన్నదంటూ నమ్మించాడు. ఇందుకు రూ.15.5 లక్షలు ఖర్చవుతుందంటూ చెప్పాడు.
అక్టోబర్, 2022లో ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. తొలుత బాధితుడు రూ.9 లక్షలు చెల్లించాడు. కొన్నిరోజుల తర్వాత గెల్విన్ ఇంటర్నేషన్ కంపెనీ నుంచి సెక్యూరిటీ పర్సనల్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందినట్లు ఇన్విటేషన్ , కెనడా గవర్నమెంట్ నుంచి లేబర్ మార్కెట్ ఇంఫాక్ట్ అసిస్మెంట్ (ఎల్ఎంఐఏ)ను తెప్పించి జగన్నాథ్‌కు అందజేశాడు. దీంతో ఫిబ్రవరి 2023లో ఒప్పందం మేరకు బాధితుడు పూర్తి డబ్బును చెల్లించాడు. ఇక వీసా వచ్చేదే ఆలస్యమంటూ జగన్నాథ్ ఎదురు చూస్తున్నాడు.
నెలలు గడిచినా వీసా రాలేదు. దీంతో అసలు కెనడా కంపెనీ నుంచి ఇన్విటేషన్ లెటర్ వచ్చిన మాట వాస్తవమా.? కదా.? అని ఆరా తీశాడు. గెల్విన్ ఇంటర్నేషన్ కంపెనీలో ఆరా తీయగా.. బాధితుడి పేరుతో రికార్డు లేదని తెలిసింది. దీంతో మదస్కుమార్ను కలిసి నిలదీశాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ బాధితుడు అడిగాడు. డబ్బులు తిరిగి ఇస్తానంటూ ఒప్పుకున్న మదస్కుమార్ రోజూ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నాడు. మరో 38 మంది బాధితులు కూడా ఈవిధంగానే మోసపోయారు. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.