సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సైబర్ పంజాలో చిక్కి.. ఓ నగరవాసి రూ.35 లక్షలు కోల్పోయాడు. ముషీరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి గతనెల 21న కేరళకు చెందిన నికితాజీవన్, శివప్రకాశ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వారు బాధితుడికి స్థానికంగా ఉండే అద్దెకు సంబంధించిన లిస్ట్‌లను పోస్ట్ చేయడం, రాబడి, బోనస్‌లు, ప్రారంభ డిపాజిట్ ఆ తర్వాత లాభాలు తదితర అంశాలపై వాటా ఇస్తామంటూ రెఫరల్ జాబ్ చేయమని చెప్పారు.
పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. బాధితుడు మొదట రూ.10వేలు డిపాజిట్ చేయగా అతనికి రూ.10748 వచ్చాయి. కొన్ని డిపాజిట్లకు లాభాలు ఇచ్చినట్లు చేయడంతో నమ్మిన బాధితుడు రూ.35,26,677 డిపాజిట్ చేశాడు. ఈ ఇన్వెస్ట్మెంట్ తర్వాత బాధితుడికి మోసగాళ్లు రెఫరల్ పనిని అప్పగించడం మానేసి డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఒకవేళ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.12 లక్షలు చెల్లించాలని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.