సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు చెలరేగిపోతున్నారనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందడంతో చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్వ్యాప్తంగా ఉన్న అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులెవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.
ఎవరి పేరుతో స్లాట్ బుక్ అవుతుందో..వారిని మాత్రమే లోనికి అనుమతించి పని పూర్తి చేస్తున్నారు. అంతేకాదు ఎవరైన కొత్తగా రవాణా సేవల గురించి తెలుసుకోవాలనుకుంటే గేటు వద్దే ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉండి ఆ వివరాలను అందిస్తున్నారు. దీంతో ఇక కార్యాలయాల్లోకి దళారులు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఈ విధానం కారణంగా ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు.
సీసీ కెమెరాల సంఖ్య పెంచి..
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రతి ఆర్టీఏ కార్యాలయాల్లో సీసీ కెమెరాల సంఖ్య పెంచడంపై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో 19 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఆర్టీఓ కార్యాలయంలో అదనంగా 8 సీసీ కెమరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు అధికారులకు కూడా సమాచారం అందింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతపరమైన అంశాలను పర్యవేక్షించే వీలుండనున్నది.
ఇటీవల ఓ ఉన్నతాధికారిపై దాడి జరగడం కూడా సంచలనంగా మారడంతో కార్యాలయాల్లోకి అనవసర పనులపై వచ్చే వారిని అనుమతించకూడదని అంతర్గంగా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే అన్నీ ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రత్యేక సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కారణంగా కార్యాలయాల్లో స్లాట్స్ మీదొచ్చే పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గడబిడ లేకుండా సాఫీగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు.