శేరిలింగంపల్లి : సీనియర్ నటుడు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేష్ మాజీ భార్యగా పేర్కొంటున్న రమ్య రఘుపతిపై పోలీసు కేసు నమోదైంది. నరేష్ పేరుతో కోట్ల డబ్బు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపిస్తూ.. ఐదు గురు మహిళలు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రమ్య రఘుపతిపై ఛీటింగ్ కేసు నమోదైంది.
రమ్య రఘుపతి నరేష్‌కి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తే రమ్య రఘుపతి. ఎనిమిదేళ్ల క్రితం నరేష్‌తో వివాహం కాగా.. తరువాత విడిపోయారు. అయితే నరేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఆ ఫొటోలు, అతని ఆస్తులు తనకే చెందుతాయని చెప్తూ రమ్య రఘుపతి కోట్ల రూపాయిలు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఇష్యూపై నటుడు నరేష్ స్పందిస్తూ.. ఈ ఇష్యూతో తనకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మియాపూర్ మదీనాగూడకు చెందిన సరిత వద్ద 2 లక్షలు తీసుకొని లక్ష తిరిగి ఇచ్చి మిగతావి ఇవ్వకపోవడం, అదే ప్రాంతానికి చెందిన సునీత వద్ద 3 లక్షలు తీసుకొని లక్ష 40 వేలు తిరిగి ఇచ్చింది.
గచ్చిబౌలికి చెందిన శ్రీనాథ్ వాసన్ వద్ద 20 లక్షలు తీసుకొని 10 లక్షలు తిరిగి ఇచ్చి మిగతావి ఇవ్వలేదు. ఏంఐజీ బీరంగూడకు చెందిన డీ. సరిత వద్ద 8 లక్షలు తీసుకొని 3 లక్షలు మాత్రమే ఇచ్చింది, మాదాపూర్‌కు చెందిన పీ.లక్ష్మీనారాయణ వద్ద 31 లక్షలు అప్పుగా తీసుకొని 11 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చింది.
తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో వీరందరూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసును ప్రాథమిక స్ధాయిలో విచారిస్తున్నారు.