Hyderabad | హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ కలకలం రేపింది. పర్వత్నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో హోంగార్డు నయీం (45) తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన హోంగార్డును వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నయీంను పరీక్షించిన వైద్యులు.. అతని కాలు విరిగినట్లుగా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నయీంను డీసీపీలు మనోహర్, హనుమంతరావు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారైన కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.