Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 20: ‘కారు వెనకసీట్లో మీరు చేసిన రొమాన్స్ మొత్తాన్ని వీడియో తీసాను..’ ‘గంటసేపట్లో రూ.50 వేలు పంపించకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ..’ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..కవాడిగూడకు చెందిన అహ్మద్ అనే యువకుడు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. అదే ఆఫీసులో పనిచేసే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. వారిద్దరూ కలిసి ఈనెల 17న సాయంత్రం ఆఫీసు నుంచి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని టీవీ 9 చౌరస్తావద్ద ఓ స్నేహితుడిని కలిసిన తర్వాత క్యాబ్‌లో ఇంటికి వెళ్లిపోయారు. వారిద్దరినీ ఇంటివద్ద దింపేసిన క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్ వెళ్లిపోయాడు.
రెండ్రోజుల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు శ్రీనివాస్ మెసేజ్ చేశాడు. తన కారులో బంజారాహిల్స్ నుంచి వెళ్తున్న సమయంలో వెనక సీట్లో నీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి చేసిన రొమాన్స్ మొత్తాన్ని తాను వీడియో తీసానని బెదిరించాడు. తనకు గంటసేపట్లో రూ.50వేలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. తనవద్ద డబ్బులు లేవని, రెండ్రోజుల టైమ్ ఇవ్వాలని కోరినా అంగీకరించలేదు. దీంతో బాధితుడు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు శ్రీనివాస్ మీద బీఎన్ఎస్ బీఎన్ఎస్ 77, 308(3), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.