బండ్లగూడ, జూలై 30: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుండగా ఒక క్రేన్‌కు సంబంధించిన బకెట్ విరిగి పడటంతో పెను ప్రమాదం తప్పింది. కిస్మత్పూర్లో అబ్బం కన్స్ట్రక్షన్స్ సంస్థ ఒక బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నది.
గత రెండేండ్లుగా కొనసాగుతున్న ఈ నిర్మాణంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి భవనానికి సంబంధించిన క్రేన్ బకెట్ కిందపడింది. ఆ సమయంలో ఓం నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చిన్న పాపతో కలిసి భవనంపై వాకింగ్ చేస్తున్నది.
ఆమె సమీపంలోనే ఈ బకెట్ పడటంతో భయాందోళనకు గురైంది. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకొని.. అబ్బం కన్‌స్ట్రక్షన్స్‌పై దుమ్మెత్తి పోశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపడుతున్నారని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కాలనీ వాసులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.