అడ్డగుట్ట, జూలై 4: ‘మన వెంకన్న మట్టిలో మాణిక్యం’ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఉద్యోగార్థుల కోసం మాగ వెంకన్న రచించిన టీఎస్పీఎస్సీ/ ఏపీపీఎస్సీ జేఎల్/డీఎల్/పీఎల్ ఇంగ్లిషు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంటు సెమినార్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణిలు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ, మట్టిలో మాణిక్యం మాగ వెంకన్న అని, ఇలాంటి గొప్ప వ్యక్తులు తెలంగాణ సమాజానికి అవసరమని ఆయన కొనియాడారు. అనంతరం, ఓయూ వీసీ రవీందర్ మాట్లాడుతూ, మాగ వెంకన్న చేసిన ప్రయత్నం ఎందరికో ఉపయోగకరమని, ఇలాంటి మంచి పుస్తకాలు వెంకన్న చేతి నుంచి వెలువడాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, కడు పేదరికాన్ని జయించి మాగ వెంకన్న ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడని అభినందించారు. అందరూ వెంకన్నను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ, ఇంగ్లిషు డిపార్టుమెంట్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, డాక్టర్ ఉపేందర్, రాజేష్, రంజిత్, శ్రీనివాస్, అంజితో పాటు తదితరులు పాల్గొన్నారు.