చర్లపల్లి, ఉప్పల్ జూన్ 2 : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేయడంతోపాటు విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ, ఐపీఎస్ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. చర్లపలి కేంద్ర కారాగారంలో తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జైళ్ల శాఖ ఐజీలు మురళిబాబు, రాజేశ్‌లతో కలిసి ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్ర కారాగారంలో ఉపాధి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఖైదీలకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చామని, దీంతో ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా సత్పవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఖైదీలను విడుదల చేశామని ఆమె తెలిపారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు జైళ్ల శాఖ ప్రతిష్ట పెంచే విధంగా జైలులో తీసుకున్న శిక్షణలతో ఉపాధి పొంది సమాజానికి ఆదర్శంగా నిలువాలని ఆమె సూచించారు.
అనంతరం విడుదలైన మహిళ ఖైదీలకు కట్టుమిషన్లను పంపిణీ చేసి ఖైదీలకు వివిధ ఉపాధి కల్పన అవకాశాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ సంపత్, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు మురాళిబాబు, రాజేశ్, ప్రముఖ వక్త మారుతికిరణ్, డాక్టర్ శ్రీనివాస్, వివిధ జైళ్ల సూపరింటెండెంట్లు ప్రమోద్, సంతోష్‌రాయ్, సంతోష్‌కుమార్, కళాసాగర్, భరత్, వెంకటలక్ష్మి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.