సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో ఎనిమిదో భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేక రైలును బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ రైలు యాత్రను సీనియర్ సిటిజన్ రాజ్యలక్ష్మి ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గ్రూపు మేనేజర్ పి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ యాత్ర తొమ్మిది రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలోని పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి దివ్య తీర్థ స్థలాలను కవర్ చేస్తుందన్నారు. సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, పెందుర్తి, విజయనగరంలో స్టాపులు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.