సిటీబ్యూరో, జనవరి 1 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 2022 సంవత్సరంలో 5,819 లైసెన్స్లు రద్దు చేసినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020లో 2,599 లైసెన్స్లు రద్దు చేశామని వెల్లడించారు. రెండేండ్లలో 8418 లైసెన్స్లు రద్దయినట్టు తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, తిరుమలగిరి, మలక్పేట, బండ్లగూడ, టోలిచౌకి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్తో మరణాలకు కారణమవుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినా డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కోసం రవాణాశాఖకు వస్తారని.. పరిశీలించి సదరు వాహనదారుడికి నోటీసులు పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని జేటీసీ కోరారు. కాగా, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈసారి అత్యధికంగా 1710 లైసెన్స్లు రద్దు అయ్యాయని పేర్కొన్నారు.