సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఈఎస్ఐ అసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాదికాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. సప్లయర్స్‌కు చెల్లించాల్సిన బిల్లులు నేటికీ అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో డిస్పెన్సరీలకు అందించే మందులు, మెటీరియల్స్‌ను సప్లయర్స్ ఒక్కోక్కటిగా నిలిపేస్తున్నారు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.80కోట్లు చెల్లించాలని బిల్లులు పెట్టుకున్నా వాటిని స్టేట్ ఫైనాన్స్ తిరస్కరిస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ను సైతం పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్ తీరుపై ఈఎస్ఐ కార్డు కలిగిన రోగులంతా మండిపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 21వేల లోపు నెల వేతనం కలిగి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగులు, పరిశ్రమలు, హోటళ్లు, కళాశాలలు, పాఠశాలలు మొదలగు రంగాల్లో పనిచేసే సిబ్బందింతా ఈఎస్ఐ వైద్యసేవలకు అర్హులు. వారందరికీ చెల్లించే నెల వేతనంలోనే వైద్యసేవల నిమిత్తం ఆయా సంస్థలు తప్పనిసరిగా ఈఎస్ఐ చెల్లిస్తాయి. ఈఎస్ఐ కార్డు కలిగిన వారికి డిస్పెన్సరీలు, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం, సర్జరీలు సైతం నిర్వహిస్తుంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు నాచారం, ఆర్సీపురం, వరంగల్‌లోని నోడల్ సెంటర్ల నుంచే మందులు, సర్జికల్ మెటీరియల్ పరికరాలు సరఫరా చేస్తుంటారు. నోడల్ కేంద్రాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన 450 రకాల మందులు, 105 రకాల సర్జికల్ మెటీరియల్‌ను సప్లయర్స్ అందిస్తున్నారు. ఏడాదికాలంగా నోడల్ కేంద్రాలకు అందించే మందులు, సర్జికల్ పరికరాలకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2024లో కేంద్రప్రభుత్వం ఈఎస్ఐ దవాఖానల కోసమని బడ్జెట్లో రూ.90 కోట్లను రాష్ట్రానికి కేటాయించి విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ మెడిసిన్ సప్లయర్స్‌కు చెల్లించాల్సిన రూ.65కోట్ల బకాయిలు చెల్లించకుండా సప్లయర్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని సరఫరాదారులు ఎన్నిసార్లు బిల్లులు పెట్టుకున్నా స్టేట్ ఫైనాన్స్ వాటిని వెనక్కి పంపించడం గమనార్హం. వాస్తవానికి ఈఎస్ఐ దావఖానలకు ఏడాదికి రూ. 280కోట్లు కేటాయించి, ప్రతి ఆరునెలలకోసారి చెల్లిస్తుంటారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పడు చెల్లించినా, నేడు కాంగ్రెస్ పాలనలో మాత్రం పెండింగ్‌లో పెడుతున్నారు. 2024 అక్టోబర్‌లో రూ.30 కోట్లు మందులకు , రూ.5 కోట్లు సర్జికల్ మెటీరియల్ కోసం విడుదల చేసినట్లు ప్రకటన చేసిన ప్రభుత్వం.. వాటిని ఇప్పటివరకు చెల్లించలేదు. వాటితో పాటు ఇటీవల మరో రూ.30కోట్లు పెండింగ్ బకాయిలు పడ్డది. మొత్తం కలిపి రూ. 65 కోట్ల పెండింగ్ బకాయిలను ఈఎస్ఐ దవాఖానలకు మందులు, సర్జికల్ మెటీరియల్ సైప్లె చేసే ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ మెడిసిన్ సప్లయర్స్‌కు చెల్లించాల్సి ఉండగా, వారికి మొండిచేసి చూపించింది.
జీవోఐ బకాయిలు రూ.15కోట్లు..
ఈఎస్ఐ దవాఖానలకు ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ మెడిసిన్ సప్లయర్స్‌తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు(జీవోఐ)కి చెందిన కర్నాటక, ఒడిశా, గోవా యాంటీబయోటిక్స్ వాళ్లు సైతం రాష్ట్రంలోని ఈఎస్ఐ దవాఖానలకు మందులు అందిస్తున్నారు. ఆ సంస్థలకు సైతం ఇప్పటివరకు 15కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటికోసం అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేను కుట్టినైట్లెనా లేదు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇప్పటికే ముఖ్యమైన పలు రకాల మందులు, సర్జికల్ మెటీరియల్ సరఫరా నిలిచిపోయింది. దాంతో వైద్యంకోసం వచ్చే ఈఎస్ఐ రోగులపై తీవ్ర భారం పడుతోంది.
కావాల్సిన మందులు అందుబాటులో లేకపోవడంతో చేతి నుంచి డబ్బులు పెట్టి మరీ ప్రైవేట్ ఫార్మసీలో కొనుగోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సర్జికల్ మెటీరియల్ కొరత కారణంగా రోగులు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తున్నది. ఈఎస్ఐ కార్డుతో వచ్చే రోగుల్లో తాత్కాలిక రోగులకంటే ధీర్ఘకాలిక రోగులే అధికంగా ఉంటారు. శ్వాస సంబంధిత రోగులకోసం ఇంటివద్ద వాడుకునే మెషిన్లు సైతం గతంలో అందించేవారు. ప్రస్తుతం వాటి కొరత కారణంగా రోగులు అవస్తలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా ఆరోగ్యరంగం నిర్వీర్యమవుతుందన్న వాదనలు రోగుల నుంచి వస్తున్నాయి.
బకాయిలకోసం ఎదురుచూపులు..
కేబీ రామచంద్ర, ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏడాదికాలంగా పెండింగ్ బిల్లులు ఇప్పించాలని విన్నవించుకున్నా కూడా అధికారులు స్పందించడం లేదు. బిల్లులు రాసి స్టేట్ ఫైనాన్స్‌లో రిజెక్ట్ చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసినా నిధులను కూడా మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నారు. అందుకే ఈఎస్ఐలో సరఫరా నిలిపేశాం.