Ganja | హైదరాబాద్ : పాతబస్తీలోని ధూల్‌పేట్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు ధూల్‌పేట్‌లోని దిలావర్ జంగ్లోని ఓ వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంట్లో నిల్వ ఉంచిన 8 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. దాంతో గంజా ప్రాసెసింగ్ మెషీన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్న రాజాసింగ్, తుల్జారాం సింగ్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
సీజ్ చేసిన గంజాయి విలువ రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గంజాయి భారీగా పట్టుబడడంతో.. ధూల్‌పేట ఏరియాలో పోలీసులు నిఘా పెంచారు. గంజాయి విక్రయాలు కొనసాగిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మరోవైపు బంజారాహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు డ్రగ్స్ సరఫరదారుల నుంచి 14.83 గ్రాముల ఎండీఎంఏ, 70 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలో పలువురికి విక్రయించేందుకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో తేలింది.