సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కన్సార్టియం ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్(సీఏహెచ్ఓసీఓఎన్-2023’) 7వ అంతర్జాతీయ సదస్సు శనివారం హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. నాణ్యమైన వైద్యం, రోగి సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించే లక్ష్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ డాక్టర్ రవి.పి.సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రతిబింబించే ప్రత్యేకమైన ప్రభుత్వ – ప్రాయోజిత కమ్యూనిటీ హెల్త్ చొరవగా పేర్కొన్నారు. నాణ్యతను ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. టాప్ ర్యాంకుల్లో ఉన్న దవాఖానలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టేటస్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ చర్యల్లో దేశం నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్-2021లో క్వాలిటీ ఆఫ్ ఇండియాలో భాగంగా భారతదేశ జాతీయ అక్రిడిటేషన్ సిస్టమ్ ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. సీఏహెచ్ఓసీఓఎన్ చైర్మన్ డాక్టర్ బి. భాస్కర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చాలా డైనమిక్ పర్సన్ అని కొనియాడారు. మంత్రి నిబద్ధతతో పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్సార్టియం ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ అగర్వాల్, కో ఆర్గనైజింగ్ చైర్మన్ ఆర్.గోవింద్ హరి, అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, డాక్టర్ గురు ఎన్.రెడ్డి, డాక్టర్ ఆర్.పి.సింగ్‌లు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.