అమీర్‌పేట, ఫిబ్రవరి 26: అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలుచేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీ మేస్త్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నారు. స్థానికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని.. బీకే గూడ, ఎస్ఆర్ నగర్లో 15 ఏండ్లుగా చిట్టీ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధిక వడ్డీ పేరు చెప్పి దాదాపు 300కుపైగా ఖాతాదారులను జమచేశారు. వారి నుంచి వసూలు చేసిన దాదాపు రూ.70 కోట్లతో ఉడాయించారు.
కాగా, పుల్లయ్య బాధితులు బల్కంపేట, ఎస్సార్ నగర్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అతని స్వస్థలమైన అనంతపురం జిల్లాలోని గుత్తి, కర్నూల్ జిల్లాలో కూడా ఉన్నారు. చాలామంది తాము దాచుకున్న నగదుతోపాటు తమకు తెలిసిన వారి నగదును కూడా అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో పుల్లయ్య దగ్గర డిపాజిట్లు చేయించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డబ్బు కోసం ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుల్లయ్య ఈనెల 24, 25, 26వ తేదీల్లో డబ్బులు చెల్లిస్తున్నానంటూ నమ్మబలికాడు. అయితే 23వ తేదీ సాయంత్రం తన ఫార్చునర్ వాహనాన్ని ఇంట్లోనే వదిలి ఓ క్యాబ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే నగదు కోసం పుల్లయ్య ఇంటికి వచ్చిన వారికి ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూడగా అసలు విషయం వెళ్లడైంది. చాలామంది పెళ్లిళ్లు వ్యాపారం, విద్యా, వైద్య అవసరాలకు సంబంధించి పుల్లయ్య దగ్గర 24 25 26వ తేదీలలో డబ్బులు తీసుకోవాల్సి ఉంది. పుల్లయ్య ఉడయించిన విషయం తెలుసుకొని బాధితులు గగ్గోలు పెడుతూ బీకే గోడలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ మేరకు బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.