సిటీబ్యూరో, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : గోల్కొండ కోటకు కేబుల్ కారు నిర్మించేందుకు హెచ్ఎండీఏ హుమ్టా సన్నాహాలు చేస్తోంది. సుదీర్ఘ కాలంగా నగరంలో కేబుల్ కార్ల నిర్మాణంపై ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక కేంద్రంగా మరిన్ని హంగులు జోడించేందుకు 7 టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఈ కేబుల్ కారును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కోట అభివృద్ధికి హెచ్ఎండీఏ రూ. 35 కోట్ల నిధులు కేటాయించింది.
ఈ నిధులతో బ్యూటీఫికేషన్తో పాటు, కేబుల్ కారును నిర్మించనున్నారు. నగరంలో ఆధునాతన రవాణా సదుపాయాలు కల్పించాలనే ప్రతిపాదనలను గతంలోనే హుమ్టా చేసింది. బీఆర్టీఎస్, కేబుల్ కారు, మోనో రైలు, సైకిల్ ట్రాక్ వంటి నిర్మాణాలను అప్పట్లోనే ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తొలి కేబుల్ కారును నిర్మించడానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. నగరంలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో 7 టూంబ్స్, గోల్కొండ కోట వరకు అభివృద్ధి పనులు చేయనున్నారు.
అధ్యయనానికి సన్నాహాలు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయనున్నారు. ఈ క్రమంలో నిర్మాణ వ్యయం, వినియోగ అవకాశం, కేబుల్ కారు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏజెన్సీని నియమించనున్నది. ఇందులోభాగంగా గోల్కొండ చుట్టూ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ.. కేబుల్ కారు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు చేసినట్లు హెచ్ఎండీఏ వర్గాలు వెల్లడించాయి.