సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): సాధారణంగా 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తులు ప్రాణాలతో బయటపడటం చాలా అరుదు. అందులో వారు కోలుకోవడానికి కనీసం 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ 60 శాతం కాలిన గాయాలకు గురైన వ్యక్తికి కొలాజిన్ షీట్స్ (వన్ టైమ్ డ్రెస్సింగ్)తో నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించి, కేవలం 15 రోజుల్లోనే రోగిని డిశ్చార్జి చేసి.. రికార్డు సృష్టించారు ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు. బిహార్‌కు చెందిన సహనబాజ్(19) వృత్తిరీత్యా గృహనిర్మాణ కార్మికుడు.
ఉపాధి కోసం నగరానికి వచ్చిన అతడు.. 15 రోజుల కిందట బండ్లగూడలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చేర్పించారు. వైద్యులు రోగిని పరిశీలించి.. 60 శాతం కాలిన గాయాలకు గురైనట్లు నిర్ధారించారు. సాధారణంగా విద్యుత్ఘాతానికి గురైన రోగులు, అందులోనూ 60 శాతం కాలిన గాయాలకు గురైన వారు ప్రాణాలతో బయటపడటం అరుదు. అంతే కాకుండా వారు రికవరీ కావడానికి కనీసం 3 నెలలకు పైగానే సమయం పడుతుంది.
అయితే రోగి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి..రోగి దవాఖానలో చేరిన 12 గంటల్లోపే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారు. ముఖం, అప్పర్ లింబ్, లోయర్ లింబ్ తదితర శరీరంలోని కీలక భాగాలు తీవ్రంగా కాలిన గాయాలకు గురికావడంతో మెడకు ‘సెంట్రల్ లైన్’ పెట్టి ఫ్లూయిడ్స్ అందించి, వెంటనే సర్జరీ జరిపినట్లు డాక్టర్ పలుకూరి లక్ష్మి వివరించారు.
60 శాతం కాలిన గాయాలకు గురైన రోగులకు సర్జరీ చేయాలంటే సాధారణంగా నాలుగైదు రోజులు ఆగాల్సి ఉంటుందని, ఆలోపు ఇన్ఫెక్షన్స్ వస్తే సర్జరీ చేయడం కుదరదని.. దీంతో రోగి కోలుకోకపోవడమే కాకుండా ప్రాణాలకూ ముప్పు ఉంటుందన్నారు. అయితే ఈ కేసులో రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ సెంట్రల్ లైన్ నుంచి ఫ్లూయిడ్స్ అందిస్తూ శరీర ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అనస్థీషియా వైద్యులు డా.మాధవి, ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యబృందంతో రోగికి మెరుగైన చికిత్స అందించి.. 15 రోజుల్లోనే డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ చొరవతో రోగికి 12 గంటల్లోనే శస్త్రచికిత్స చేయడమే కాకుండా ఖరీదైన 10 కొలజన్ షీట్స్‌తో బయోలాజికల్ డ్రెస్సింగ్ చేశాం. సాధారణంగా కాలిన గాయాలకు గురైన రోగులకు కార్పొరేట్లో అయితే ఒక శాతానికి లక్ష రూపాయల చొప్పున ఖర్చవుతుంది. సహనబాజ్కు జరిపిన చికిత్సకు ప్రైవేటులో కనీసం రూ. 20 లక్షలకు పైనే ఖర్చవుతుంది. అంత ఖరీదైన వైద్యాన్ని పైసా ఖర్చులేకుండా విజయవంతంగా నిర్వహించాం.
పేద రోగుల వైద్యానికి దవాఖాన సూపరింటెండెంట్ డా.నాగేందర్ ప్రత్యేక కొరవ తీసుకోవడం వల్లే ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతంగా ట్రీట్ చేయగలుగుతున్నాం. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ వారోత్సవాల్లో భాగంగా ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా ట్రీట్ చేసి..15 రోజుల్లోనే రోగిని పూర్తిగా కోలుకునేలా చేసి.. నడిపించగలిగాం. ఇంత తక్కువ సమయంలో రోగి కోలుకోవడం ప్రపంచ రికార్డుగా చెప్పవచ్చు.
– ప్లాస్టిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పలుకూరి లక్ష్మి