ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించినందుకు భార్య పిల్లలను అత్యంత కిరాతంగా హత్యచేశాడు. అర్ధరాత్రి సమయంలో గంట వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ ఘోరంతో షాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆరుగురిని ఓ ఉన్మాది గొంతులు కోసి చంపేయడం..కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపై బైఠాయించి..పోలీసులు, సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్ష నేతలు రాకుండా పోలీసులు అడ్డుకోగా, అధికార పార్టీ ఎమ్మెల్యే కాలె యాదయ్యపై జనం తిరగబడ్డారు. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారు. ఈ వరుస హత్యలు రాష్ట్రంలో విఫలమైన శాంతి భద్రతలు, పోలీసుల నిర్లక్ష్యం, అవినీతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతోందంటూ.. భయకంపితులకు గురవుతున్నారు.
సిటీబ్యూరో/షాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): ఎప్పటిలాగేనే పల్లెలల్లో మేల్కొంటున్న సమయం..రాజధానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున దవాహనంలా వ్యాపించిన ఆరు హత్యల ఘటన యావత్ జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. ఒకే రాత్రి గంట వ్యవధిలో పిల్లలతో సహా ఆరుగురిని ఓ ఉన్మాది గొంతులు కోసి చంపేశాడని తెలిసి.. దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ఏ నాలుగు కూడళ్లలో చూసి ఈ ఘోర ఉదంతంపైనే చర్చసాగింది. పోక్సో కేసులో నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి ఆరుగురిని ఊచకోత కోశాడనే విషయం తెలుసుకొని భయంతో ప్రజలు వణికిపోయారు.
గుండెల్లో గుబులు.. భయకంపితులైన పల్లెలు
షాబాద్ మండలంలోని దైవాల్గూడకు చెందిన రాజ్‌కుమార్ చేసిన వరుస హత్యల ఉదంతం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను, ఇంటి పక్కనే ఉన్న బాలిక కుటుంబాన్ని ఇంత కిరాతంగా చంపడా? అసలు మన చుట్టూ తిరిగే మనుషుల్లో ఇలాంటి ఉన్మాదులు ఉన్నారా అంటూ జనం భయంతో వణికిపోతున్నారు.
రణరంగంగా మారిన షాబాద్
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆరు నిండు ప్రాణాలు బయలయ్యాయని, తెల్లవారముందే శవాలను పోలీసులు తరలించి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి బాధితుల బంధువులు, స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున్న రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రహదారులను దిగ్బంధించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడికి శిక్ష పడేవరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. షాద్‌నగర్, కంది రోడ్డుపై స్థానిక ప్రజల ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఎక్కడికక్కడే దిగ్భందం..!
ఆరు వరుస హత్యల ఘటనతో షాబాద్ ప్రాంతం ప్రజాగ్రహంతో అట్టుడికిపోయింది. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలిచింది. రాజధాని నుంచి బీఆర్ఎస్ నాయకులు ఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రయత్నించారు. ప్రముఖ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. వారిని సంఘటన స్థలానికి రాకుండా చేశారు. స్థానిక నాయకులు బాధితులకు అండగా నిలిచారు.. అయినా మరికొంత మందిని పోలీసులు స్థానికంగా కూడా అడ్డుకున్నారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని పలువురు బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు బాధితుల వద్దకు వచ్చి మద్దతు పలికారు.
స్థానిక ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం..!
ఘటన విషయం తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన కాలె యాదయ్య చేరుకున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ హత్యలు జరిగాయని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకొని ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారు.
షాబాద్‌లో పోలీస్ కమిషనర్, కలెక్టర్
ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి శనివారం ఉదయం నుంచి షాబాద్‌లోనే తిష్ట వేశారు. పోలీసులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజలను సముదాయించేందుకు ప్రయత్నించారు. ఆయిన ప్రజలు ఉన్నతాధికారుల మాటలను నమ్మలేదు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబడ్డారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి కూడా అక్కడకు చేరుకొని బాధితుల డిమాండ్లను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై సీపీ తరుణ్ జోషి చర్యలు చేపట్టారు. ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ, సీఐ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్న ప్రజలు కొంత శాంతించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే ఎస్ఐను సస్పెండ్ చేశాం. సీఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబంలో దివ్యాంగురాలైన యువతికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. ఆమెకు ఇల్లు లేకుంటే ఇంటిని నిర్మించి ఇస్తాం. ఆమె ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం తరఫున కొనసాగుతున్న సోషల్ వెల్ఫేర్ సెంటర్లో జాయిన్ చేస్తాం. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేస్తుంది.
-నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్