బేగంపేట్, ఏప్రిల్ 20 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారికి తెలంగాణ సర్కారు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం బేగంపేట్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 52వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దేశంలోనే రెండవ ఉత్తమ కళాశాలగా నిలువడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యాభ్యాసం తరువాత విద్యార్థులు పట్టుదలతో తాము అనుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించాలన్నారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులను ఆమె ప్రశంసించారు. కళాశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చిన దొడ్ల శేషారెడ్డిని మంత్రి అభినందించారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి కళాశాల వార్షిక ప్రగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వసుధ, విజయ్‌కుమార్, పుష్ప, ప్రసన్న, రామాచారి, శ్రావణి, పద్మజ, వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.