Hyderabad Metro | సిటీబ్యూరో: ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో కావాలంటూ చేపట్టిన ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. రేవంత్ సర్కారు రెండోదశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఉత్తర హైదరాబాద్‌కు మొండి చెయ్యి చూపడంతో ఆ ప్రాంతం వాసులంతా ఒక్కటయ్యారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో సాధించడమే ప్రధాన లక్ష్యంగా తమ ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు మార్గాల్లో మెట్రో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్ పార్యడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా మేడ్చల్-కండ్లకోయ, సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి అల్వాల్ మీదుగా శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు డబుల్ డెక్కర్ రోడ్డు కమ్ మెట్రో బ్రిడ్జీ నిర్మాణానికి ప్రతిపాదించారు.
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికే కాకుండా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కీలకమైన హైదరాబాద్-నాందేడ్ జాతీయ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి వంటి మార్గాలపై ఉన్న ట్రాఫిక్ నేపథ్యంలో మెట్రో నిర్మాణం అత్యవసరమని ట్రాఫిక్ నిపుణులు చెప్పారు. వీటన్నింటినీ పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశలో ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి ఒక్క మెట్రో మార్గాన్ని ప్రకటించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ ప్రాంతవాసులంతా ఒక్కటై ఉద్యమానికి తెరతీశారు. జన సాంధ్రతతో పాటు వ్యాపార, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఉత్తర ప్రాంతానికి మెట్రో మార్గాలను సాధించే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆన్లైన్ వేదికగా ఉధృతంగా ఉద్యమం
ప్రజలు సామూహికంగా తమకు కావాల్సిన డిమాండ్లను నేరవేర్చుకొనేందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకొని ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్ మెట్రో సాధన సమితి సైతం ఆన్లైన్లో చేంజ్.ఓఆర్జీ (www.Change.org) వేదికగా తమ డిమాండ్లను సంబంధిత సంస్థలకు, వ్యక్తులకు చేరేలా చేస్తున్నారు.అదే తరహాలో మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్లకు తమ డిమాండ్లను పిటిషన్ల రూపంలో వారికి చేరేలా చేస్తున్నది. ఇదే వేదికగా 25వేల మందితో సంతకాల సేకరణ చేపట్టగా, ఇప్పటి వరకు 20వేల సంతకాలు చేశారని మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్‌రెడ్డి తెలిపారు.
మెట్రో సాధన సమితి కోరుతున్న మార్గాలు..