బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు బయట జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలో 480 గజాల స్థలాన్ని మల్టీ లెవల్ పార్కింగ్ కోసం నవ నిర్మాణ్ అసోసియేట్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. తనకు కేటాయించిన స్థలానికి అదనంగా పార్కింగ్ లాట్లో ఉన్న సుమారు 100 గజాల స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న నిర్మాణ సంస్థ..
ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభంలో ఉన్న డిజైన్‌ను మార్చేసి సుమారు 100 గజాల పార్కు స్థలంలోకి చొచ్చుకువచ్చిన సదరు సంస్థ.. జీహెచ్ఎంసీకి చెందిన ప్రహరీని కూల్చేసింది. ఈ వ్యవహారంపై కేబీఆర్ పార్కు వాకర్లతో పాటు సందర్శకులు జీహెచ్ఎంసీ మేయర్‌తో పాటు జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా ప్రహరీని కూల్చడంతో పాటు రోడ్డు కోసమంటూ లోనికి చొచ్చుకురావడం సరికాదని, ఒకవేళ అదనపు స్థలం కావాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలంటూ సూచించిన బల్దియా అధికారులు.. అక్రమంగా నిర్మించిన ప్రహరీని రెండ్రోజుల కిందట కూల్చేశారు.
అయితే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీచేయలేరంటూ సదరు సంస్థ యాజమాన్యం జీహెచ్ఎంసీ కూల్చేసిన ప్రహరీని మంగళవారం రాత్రి తిరిగి కట్టేసి అధికారులకు సవాల్ విసిరింది.