అడ్డగుట్ట, జూలై 24 : వారిద్దరు భార్యాభర్తలు. పనిచేసే ఇంట్లోనే 40 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఎవరికీ అనుమానం రాకుండా నగలు మరో చోట భద్రపరిచారు. రోజువారీ మాదిరిగానే యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటూ అందరితో కలిసిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానంతో పని మనుషులను కూడా విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. భార్యాభర్తలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మట్టంరాజు, డీఐ రుక్మిణితో కలిసి చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. చిలకలగూడ నివాసి ఎన్ఎస్ నర్సింహా రావు వ్యాపారి. బోనాల పండుగ సందర్భంగా ఈనెల 20వ తేదీన బీరువా తెరిచి చూడగా.. అందులో దాచిన 40 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. కంగారు పడి ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా నగలు దొరకలేదు. దీంతో బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.రుక్మిణి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్న పోలీసులకు.. అదే ఇంట్లో గతకొంతకాలంగా పనిచేస్తున్న భార్యాభర్తలు వీరబాబు(40), కుమారి(37)పై అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి వద్దనుంచి 40 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టుచేసి, సోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.