సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకొని.. తాము పోలీసులంటూ బెదిరించిన సైబర్‌నేరగాళ్లు రూ. 38 లక్షలు కాజేశారు. వివరాలిలా ఉన్నాయి.. 74 ఏండ్ల బాధితురాలికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. ముంబైలోని అంధేరి పోలీస్‌స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.. మీ ఫోన్ నంబర్‌ను ట్రాయ్ 24 గంటల్లో డిస్కనెక్ట్ చేస్తుంది.. అని బెదిరించారు. జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయెల్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌తో మీకు సంబంధం ఉన్నట్లు తేలింది.. అందులో భాగంగానే సీబీఐ, ఈడీ కేసులు దర్యాప్తు చేస్తున్నాయి.. అంటూ భయపెట్టారు. మీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయాలి..
మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉంటే ఆర్బీఐ ఖాతాలో జమ చేయాలి.. అంటూ ఆమెను ఆందోళనకు గురిచేశారు. మీకు ఈ కేసుతో సంబంధం లేదని తేలితే.. మీరు ఆర్బీఐలో జమచేసిన డబ్బు తిరిగి వస్తాయంటూ నమ్మించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే మీరు అరెస్ట్ అవుతారని, ఈ కేసులో మీ కుటుంబం మొత్తం ఇరుకుంటుందంటూ హెచ్చరించారు. దీంతో బాధితురాలు భయపడిపోయింది. ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసి రూ. 37.90 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా సైబర్‌నేరగాళ్ల సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు అనుమానం రావడంతో కుటుంబసభ్యులతో చర్చించడంతో ఇదంతా మోసమని చెప్పారు. దీంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి ఘటనలు ప్రతి రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతూనే ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ మాట్లాడే సీనియర్ సిటిజన్లు, నడి వయస్సు వాళ్లు ఇందులో ఎక్కువగా మోసపోతున్నారు. రెండు రోజుల కిందట ఓ వైద్యురాలిని కూడా ఇదే విధంగా బెదిరించిన సైబర్‌నేరగాళ్లు.. దాదాపు 10 రోజుల పాటు ఆమెను డిజిటల్ అరెస్ట్‌లోనే ఉంచి రూ.3 కోట్లు కొట్టేశారు. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే, ఇటీవల మన్‌కీ బాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం డిజిటల్ అరెస్టులంటూ ఏమీ ఉండవని, అలాంటి వాటికి భయపడొద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాలపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.