మేడ్చల్: రాజీవ్ రహదారిపై జేబీఎస్ నుంచి శామీర్పేట రింగురోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్ బ్రిడ్జి)కి సంబంధించి భూ సేకరణపై అభ్యంతరాల గడువు ముగిసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిపిన భూ సేకరణపై 258 అభ్యంతరాలు వచ్చాయి. కారిడార్ నిర్మాణానికి అవసరమయ్యే ప్రస్తుత రోడ్డుకు ఇరు వైపులా మరో 50 ఫీట్ల చొప్పున సేకరించి వంద ఫీట్ల రోడ్డుగా విస్తరించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు జరిపిన భూ సేకరణలో 348 నిర్మాణాలు, 1,12,050 గజాల స్థలం ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఆస్తులు కోల్పోనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల కోల్పోతున్న ఆస్తుల వివరాల జాబితాను హెచ్ఎండీఎ అధికారులకు సమర్పించారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం 18 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. 12 కిలోమీటర్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి రాగా, మరో 6 కిలో మీటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే భూ సేకరణకు సంబంధించి ఆస్తులకు చెందిన వారి నుంచి 258 అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో హెచ్ఎండీఎ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారన్నది త్వరలో తేలిపోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. భూ సేకరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి ప్రస్తుతం వారి వారి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరకు రెట్టింపు ధర నష్టపరిహారం అందించనున్నారు. త్వరలోనే ఫైనల్ డిక్లరేషన్ను విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లా పరిధిలో జరిపిన భూ సేకరణలో హెచ్ఎండీఎకు 258 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో అధిక మంది రోడ్డు విస్తరణను తగ్గించాలని, బైపాస్ రోడ్డువేసి తమ ఆస్తులను రక్షించాలని, ప్రస్తుతం ఉన్న రోడ్డుతోనే సరిపెట్టాలని సూచించనట్లు అధికారుల ద్వారా తెలిసింది. లోతుకుంట నుంచి హైదరాబాద్ జిల్లాలో భూ సేకరణ పనులు జరగాల్సి ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో..
జేబీఎస్ నుంచి శామీర్పేట రింగు రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో ప్లాన్ తయారు చేయించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యలను అధిగమించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నిస్తుందో వేచి చూడాల్సిందే.