Ganja | హైదరాబాద్ : బేగంపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ జీఆర్పీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో గురవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఒడిశా నుంచి ముంబైకి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి నుంచి రూ. 16.5 లక్షల విలువ చేసే 33.05 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రాజేశ్ బిషోయ్(26), సుజాత సింగ్(29)గా పోలీసులు గుర్తించారు. రెండు ట్రాలీ సూట్‌కేసుల్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
గంజాయి స్మగ్లర్ కిశోర్ లైమా సూచనల మేరకు రాజేశ్, సుజాత కలిసి ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కిశోర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేజీకి రూ. 1000 చొప్పున ఇస్తామని వీరిద్దరితో కిశోర్ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, కిశోర్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.