సిటీబ్యూరో, జూలై11, (నమస్తే తెలంగాణ): ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిపోయిన బడుగు జీవులు రసాయనాలు కలిపిన కళ్లు తాగి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అడ్డూ అదుపులేకుండా ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఇష్టమున్నట్లు మద్యం, కల్తీ కల్లు తాగేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. పేద ప్రజలు, నగరాల్లోని బస్తీవాసులు కల్తీ కల్లును తాగి బానిసలుగా మారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా అలవాటు చేసుకున్న మద్యాన్ని వ్యసనంగా మార్చుకున్నారు. సుక్కలేనిదే పూట గడవదన్న ధోరణి నెలకొంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చే బాధితుల్లో 30 శాతం కల్తీ కల్లు బాధితులే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
మత్తు అనేది స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా అలవాటై చివరకు వ్యసనంగా మారుతుంది. గ్లాస్ నుంచి మొదలై బాటిళ్లకు బాటిళ్లు తా గేవరకు చేరుతుంది. కల్తీకల్లు తాగేవారిలో చాలా వరకు పేద, మధ్య తరగతి ప్రజలే ఉండటం గమనార్హం. లాభార్జనే ధ్యేయంగా పేదవాడి ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ కల్లు తయారు చేస్తూ ఎంతో మంది అనారోగ్యాలకు గురికావడానికి కారకులవుతున్నారు. యూరియా, డైజమ్, మిథైల్ అల్కాహాల్, నైట్రెట్స్, ఫార్మలన్ వంటి విష పదార్థాలతో కల్లును తయారు చేస్తున్నారు.
మానవ శరీరానికి ఎంతో హానికరమైన కెమికల్స్‌తో తయారు చేసిన కల్లును తాగిన వారంతా శరీరంలోని అవయవాలు పాడై మంచమెక్కుతున్నారు. ఈ కల్తీ కళ్లు తాగడం మూలంగా మనిషి మెదడు తీవ్రంగా దెబ్బతింటుంది. నిద్రమత్తులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో రక్తనాళాలు దెబ్బతీని రక్తం కారుతుంది. చూపు దెబ్బతింటుంది. చివరకు లివర్, కిడ్నీలు దెబ్బతినే స్థాయికి చేరుతుంది. ఈ దశలో డయాలసిస్ వంటి చికిత్సలు చేయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కోల్పోతారు.
కల్తీ కల్లు వ్యసనానికి అలవాటు పడినవాడి వారికి చికిత్సనందించేందుకు ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ మానసిక వైద్యశాల డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకొస్తుంటారు. కేవలం గ్రేటర్ ప్రజలేకాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం ఇతర వ్యసనాలకు అలవాటుపడిన వారు కూడా వచ్చి చికిత్స తీసుకుంటారు. ఇదిలా ఉండగా వ్యసనాల నుంచి విముక్తి చేసేందుకు ఇక్కడి వైద్యులు..కౌన్సిలర్లు 21రోజుల పాటు డీ టాక్సిఫికేషన్ పద్ధతిలో ప్రత్యేక వైద్యమందిస్తుంటారు.
మత్తుకు బానిసైన వ్యక్తులు ఈ 21రోజుల పాటు అందించే చికిత్సలో మత్తు, మద్యానికి దూరంగా ఉండటం మూలంగా వివిధ రకాల లక్షణాలను వైద్యులు పర్యవేక్షించి వైద్యమందిస్తారు. ఇందులో ప్రధానంగా బాధితుడు డీ అడిక్షన్ సెంటర్లో చేరిన మొదటి ఆరు గంటలు అధికంగా చిరాకుతో ఉంటూ కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ తరువాత 12 -24 గంటల మధ్య సమయంలో నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. 24-36 గంటల సమయంలో చెవిలో ఎవరో మాట్లాడినట్లుగా వినిపించడం, చుట్టూ ఎవరో ఉన్నట్లు భ్రమ పడతారు. అనుమానంగా దిక్కులు చూస్తారు.
48-72 గంటల సమయంలో కోమాకు వెళ్లే ఆస్కారం నెలకొంటుంది. కల్తీ కల్లు, మద్యం బాధితుల్లో నెలకొన్న ఈ తరహా లక్షణాలను వైద్యులు చికిత్సనందించే సమయంలో గమనిస్తారు. ఈ 21రోజుల పాటు మానసికంగా మారాలని, తిరిగి మంచి మార్గంలో వెళ్లేందుకు ప్రేరణ చికిత్సలందిస్తుంటారు. యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు బాధితుల కుటుంబాలకు సైతం కౌన్సిలింగ్ ఇస్తారు. వాటితో పాటు ఆరోగ్య పరీక్షల్లో వచ్చిన రిపోర్టుల ఆధారంగా సంబంధిత వైద్యులను సంప్రదించి వైద్యమందించేలా సిఫారసు చేస్తారు. ఈ 21 రోజుల ప్రత్యేక చికిత్స అనంతరం ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు మిగతా చికిత్సను మందులు ద్వారా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఎట్టి పరిస్థితుల్లో మత్తు పదార్థాలకు బానిస కావొద్దు.. అవి విషం లాగా మారి శరీరాన్ని సర్వనాశనం చేస్తాయి. మత్తు పదార్థాలు, కల్తీ కల్లు కేసులు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. వీరిలో మహిళలు కూడా ఉండటం ఆశ్చరాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఏం చేస్తున్నారన్నది గమనించాలి. లేదంటే భవిష్యత్ అంతా మత్తుమయమవుతుంది.
– ప్రొఫెసర్ డాక్టర్ వివస్వాన్ బూర్ల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల