Gandhi Hospital | బన్సీలాల్ పేట్, మార్చి 20 : రోజురోజుకి పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అత్యవసర సేవల విభాగంలో అదనంగా 30 పడకలను ఏర్పాటు చేస్తున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ఎన్ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె తన చాంబర్లో వివిధ విభాగాల హెచ్వోడీలు, ఆర్ఎంవోలు, నర్సింగ్, సాంకేతిక, పారిశుధ్య సిబ్బందితో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
గాంధీ దవాఖానాలో రోగులందరికీ మెరుగైన సేవలు అందిస్తున్నామని, ప్రజలందరికీ ఇక్కడ లభించే వైద్యంపైన విశ్వాసం పెరిగిందని ఆమె అన్నారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగమైన క్యాజువాలిటీ వార్డులో ప్రస్తుతం 60 పడకలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా 15 శస్త్ర చికిత్స, 15 వైద్య చికిత్స కోసం కొత్తగా 30 పడకలను అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సునీల్ కుమార్, ఆర్థోపెడిక్ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ డాక్టర్ బి. వాల్యా, జనరల్ సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం, జనరల్ మెడిసిన్ హెచ్వోడీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. సునీల్ కుమార్, ఆర్ఎంవోలు పాల్గొన్నారు.