సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందు బాబులు పట్టుబడ్డారు. సైబరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో బైక్ నడిపి.. ఒక వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో బిర్యానీలో ముక్కలు రాలేదని, చల్లగా ఉందంటూ ప్రశ్నించిన పాపానికి హోటల్లో పనిచేసే సిబ్బంది, యాజమాన్యం కలిసి కస్టమర్లను చితకబాదారు. వీటితో పాటు ట్రై కమిషనరేట్ల పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు, ప్రమాదాలు మినహా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ పరీక్షలు) నిర్వహిస్తామంటూ మూడు రోజుల ముందు నుంచే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు హెచ్చరిస్తూ వచ్చారు. అయినా.. మందుబాబులు న్యూ ఇయర్ వేడుకల్లో మందులో మునిగి, తేలారు. చివరకు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని గోషామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రానికి కౌన్సెలింగ్‌కు తరలివెళ్లడంతో అక్కడ మందు బాబులతో రద్దీ ఏర్పడింది.
అడుగడుగునా డీడీ పరీక్షలు..
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కూకట్‌పల్లిలో ఎస్ఆర్నగర్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కేఎల్ఎం దుస్తుల షాపులో పనిచేసే దుర్గయ్య(58)ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ధూల్‌పేటకు చెందిన సుమిత్‌సింగ్ మరో ఏడుగురితో కలిసి అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్లో భోజనం చేసేందుకు రాత్రి వెళ్లారు. వివిధ వంటకాలను ఆర్డర్ చేశారు. వెయిటర్ రోటీలు, బిర్యానీ తీసుకొచ్చాడు. మటన్ బిర్యానీ చల్లగా ఉన్నదని, సరిగ్గా ఉడకలేదంటూ వెయిటర్‌ను అడిగారు. వెయిటర్ దానిని వేడి చేసి తిరిగి తెచ్చాడు. బిర్యానీ సరిగ్గా లేదంటూ.. మేము బిల్లు చెల్లించమంటూ దూల్‌పేట వాసులు చెప్పారు. కౌంటర్ వద్దకు వచ్చిన తరువాత కూడా మటన్ బిర్యానీ బిల్లుపై వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో హోటల్లో పనిచేసే సర్వర్లు, ఇతర పనివాళ్లు ధూల్‌పేట వాసులపై దాడికి దిగి చికతబాదారు. హోటల్ యజమానితో పాటు దాడికి పాల్పడిన వారిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్థానిక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించి.. హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారి సంఖ్య
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిలో 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్న వారు 1,400 మందికి పైగానే ఉన్నారు. సైబరాబాద్‌లో 18 మందికి బీఏసీ కౌంట్ 500 ఎంజీపైగానే వచ్చిందని పోలీసులు వెల్లడించారు.