హైదరాబాద్ : గచ్చిబౌలి దోపిడీ కేసును మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న జయభేరీ ఆరెంజ్ కౌంటీ సీ-బ్లాక్‌లోని 110వ ప్లాట్‌లో సీబీఐ అధికారులమంటూ బంగారం, నగదును దోచుకెళ్లిన వారిని నకిలీ అధికారులుగా పోలీసులు గుర్తించారు. ఇంటి ఓనర్ సుబ్రహ్మణ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం పని చేసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. 135 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదుతో ఉడాయించారు.
ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. సుబ్రహ్మణ్యం దగ్గర పని చేస్తున్న జశ్వంత్‌ను కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. జశ్వంత్ తన స్నేహితుడు సందీప్‌తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు.