Himayat Sagar | హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతుండడంతో.. జలమండలి అధికారులు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 2 వేలు కాగా, ఔట్ ఫ్లో 1400 క్యూసెక్కులుగా ఉంది.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. మూసీ వంతెనపై వరద ప్రవాహంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
సోమవారం మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత అంటే 2 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్ధారత్రి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో 25 నుంచి 55 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.