
రాష్ట్రంలోనే నంబర్‌వన్.. బోరబండ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాల
3025 మందికి విద్యాబుద్ధులు నేర్పుతున్న ఏకైక పాఠశాల
సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో ఇంగ్ల్లిష్ మీడియం స్కూళ్లకు ప్రజాదరణ పెరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో వారి పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాటు డిగ్రీలు పూర్తి చేసి, ఉద్యోగాలు చేస్తున్న విద్యావంతులు సైతం వారి పిల్లలను ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు హైదరాబాద్‌లోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాక్ష్యంగా నిలుస్తున్నది. 2006లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ప్రారంభమైన ఈ స్కూల్లో ప్రతియేటా అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 56 మంది టీచర్లు నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఈ స్కూల్ నం.1 స్థానంలో నిలిచింది.
3025 పైగా పిల్లలు నమోదు..
2021-22 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 3025 మంది పిల్లలు అడ్మిషన్లు పొందారు. ఇందులో బోరబండ స్కూల్‌కి 2000 మంది రాగా.. ఇందులో ఇంగ్లిష్ మీడియంలో 1625 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో బాలురు 995 మంది, బాలికలు 975 మంది ఉన్నారు. ఇందులో కేవలం 345 మంది విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియంలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 1,055 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలురు 565, బాలికలు 490 మంది ఉన్నారు. వారిలో కూడా ఇంగ్లిష్ మీడియం 902 మంది, తెలుగు మీడియం 153 మంది విద్యార్థులు ఉన్నారు. హైస్కూల్, ప్రాథమిక స్కూళ్లలో కలిపి మొత్తం 2,527 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఇందులో మైనారిటీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
56 మంది టీచర్లు పాఠాలు..
ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న బోరబండ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో దాదాపు 56 మంది టీచర్లు అంకితభావంతో పని చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పరంగా టీచర్ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. స్కూల్ వాతావరణం, మెరిట్ విద్యార్థులు, పోటీతత్వం చూసి టీచర్లు ఎంతో ఓపికగా ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధిస్తున్నారు. అందుకే మెరుగైన ఫలితాలు ఈ స్కూల్లో నమోదవుతున్నాయి.
విద్యార్థుల్లో చురుకుతనం..
పూర్తి ఇంగ్లిష్ మీడియం చదువులతో విద్యార్థుల్లో చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంగా నిండుగా ఉంటుంది. దీంతో ఆటలు, పాటలు, సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించే పరిశోధనా ప్రాజెక్టులు, ఇలా ఏ రంగంలోనైనా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. ఐఐఐటీలో కూడా అడ్మిషన్లు పొందుతున్నారు.
ఎన్జీవో సహకారంతో డిజిటల్ క్లాసు రూమ్‌లు..
ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న బోరబండ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్ అభివృద్ధికి ఎన్జీవో సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు గదులను విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్‌రూమ్‌లుగా తీర్చిదిద్దారు. ప్రతి దానికి లక్ష రూపాయలు కేటాయించారు. భవష్యవాణి అనే ఎన్జీవో సంస్థ ఈ మేరకు డిజిటల్ క్లాస్‌రూమ్‌ల అభివృద్ధికి సహకారం అందించి ఆదర్శంగా నిలుస్తున్నది.
స్కూల్ అభివృద్ధికి రూ.1.50 కోట్ల ప్రతిపాదనలు..
3025 మంది విద్యార్థులు చదువుతున్న ఈ స్కూల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో స్కూల్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. 36 తరగతి గదులు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏ, బీ, సీ, డీ సెక్షన్లు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థుల సంఖ్య వల్ల రూమ్‌లు సరిపోవడం లేదు. పైగా అన్ని తరగతి గదులను డిజిటల్ క్లాసులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం, మరమ్మతులు, నీటి సదుపాయం, తదితర వాటికోసం రూ.1.50 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
650 మందికి మధ్యాహ్న భోజనం
విద్యావంతులు మెచ్చిన బోరబండ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా బాగానే కొనసాగుతుంది. ప్రతిరోజు ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు 650కి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ‘మన్న’ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాలో సెంట్రలైజ్డ్ వంటశాలతో బడికి వేడివేడి భోజనం సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నబియ్యం, పోషక విలువలు ఉండే విధంగా భోజనం పెడుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో ఉన్న పిల్లలను అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే 2006లో బోరబండలో ఇంగ్లీష్ మీడియం బోధనతో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ స్కూల్‌కు తిరుగులేకుండా ఉంది. ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల 3025మంది విద్యార్థులు ఇక్కడ నమోదయ్యారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మారిస్తే.. అన్ని స్కూళ్లలో ఉండే గ్రామీణ, పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువుల విధానాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు.
310 మంది పదవ తరగతిలో..
ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను 310 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. వచ్చే ఏప్రిల్/మేలో పది పరీక్షలు రాయనున్నారు. 2018-19లో 213మంది, 2019-20లో 249 మంది, 2020-21లో 269 మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉండగా.. 2021-22 విద్యా సంవత్సరంలో 310 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రతియేటా 85శాతం ఉత్తీర్ణత నమోదవుతున్నది.