తొలిసారి నలుగురికి తుంటి కీళ్ల మార్పిడి
మహారాష్ట్రకు చెందిన రోగికి హెర్నియా చికిత్స
ఆరోగ్యశ్రీ పరిధిలోకి 642 ఆయుష్మాన్భారత్ కేసులు
వివరాలు వెల్లడించినఆస్పత్రి సూపరింటెండెంట్ డా॥నాగేందర్
సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్ బజార్: అరుదైన, ఖరీదైన శస్త్ర చికిత్సలకు చిరునామాగా మారిన ఉస్మానియా జనరల్ వైద్యశాల మరో మైలురాయిని చేరింది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఖరీదైన హిప్-జాయింట్ (తుంటి కీళ్లు) మార్పిడి శస్త్రచికిత్సలను పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉస్మానియా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సను చేయడం ఉస్మానియాలో చేయడం ఇదే తొలిసారి. అంతేకాక ఆయుష్మాన్భారత్ కింద కూడా ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులకు వైద్యసేలను ఇక్కడి వైద్యులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన ఒక రోగికి అంబ్లికల్ హెర్నియా శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ రమేశ్, డాక్టర్ తిమ్మారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డిలతో కలిసి ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నానికి చెందిన నాగరాజు(28), ఘట్కేసర్కు చెందిన రవి(49), సరూర్‌నగర్‌కు చెందిన పద్మ(40), మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన అమృతమ్మలు కొంతకాలంగా తుంటి నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్ని దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోవడం.. నొప్పులు తీవ్రం కావడంతో ఉస్మానియాకు వచ్చారు. ఈ మేరకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ నలుగురు రోగులకు ఆరోగ్యశ్రీ కింద పైసా ఖర్చులేకుండా హిప్-జాయింట్ రీప్లేస్మెంట్ జరిపినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. హిప్-జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ కింద తొలి సర్జరీ..
ఉస్మానియాలో ఆయుష్మాన్ భారత్ కింద కూడా శస్త్రచికిత్సలు జరుపుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. ఇందులో భాగంగా తొలిసారిగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఒక రోగికి అంబ్లికల్ హెర్నియా శస్త్రచికిత్స జరిపినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని శస్త్రచికిత్సలను ఆయుష్మాన్భారత్ కింద చేస్తున్నట్లు డాక్టర్ నాగేందర్ వివరించారు.