సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మహానగరం పరిధిలోని 28 నియోజకవర్గాల ఓట్ల జాబితాను పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నవంబర్ 11న తుది జాబితా వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్లకు అవకాశంతోపాటు, చనిపోయిన, నకిలీ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను గుర్తించి వారిని ఈ జాబితా నుంచి తొలగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 55వేల మంది కొత్త ఓటర్లు నమోదు చేయగా.. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 40వేల మంది కొత్త ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును పొందారు. దీంతో జీహెచ్ఎంసీలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 1,00,55,917గా ఉన్నదని వెల్లడించారు.