సిటీబ్యూరో/మియాపూర్/దుండిగల్/హయత్‌నగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బస్సు ప్రమాద ఘటనలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో పలువురు ఇది తమకు పునర్జన్మ అని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో కొందరు గాయాలకు గురై కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతుండగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు ఆరుగురు, ఏపీకి చెందిన వాళ్లు 11 మంది, కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారు నలుగురు, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఒకరు ఉండగా, మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వారిలో బడంత్ర జయసూర్య (24), మియాపూర్, అండోజ్ నవీన్‌కుమార్(26) హయత్‌నగర్, కపర అశోక్(27) హైదరాబాద్, పునుపట్టి కీర్తి ఎస్ఆర్నగర్, వేణుగోపాల్‌రెడ్డి(24) హైదరాబాద్, ఎం.జి.రాంరెడ్డి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సురక్షితంగా బయటపడిన వారు కొందరు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
గాఢ నిద్రలోకి జారుకోకపోవటంతో పాటు చివరి సీట్లో కూర్చోవటం వల్ల ప్రాణాలు దక్కించుకోవడం కోసం అద్దాలు పగలగొట్టి బయటకు దుకాం, నాతో పాటు మరికొందరు కూడా అక్కడి నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని జయసూర్య తెలిపారు. మియాపూర్ ప్రజయ్ షెల్టర్ 13వ బ్లాక్‌లో నివాస ఉండే సుబ్బారాయుడు రమాదేవి దంపతుల కుమారుడు జయసూర్య బీటేక్ పూర్తి చేసి ఇంటర్వ్యూ నిమిత్తం వేమూరు ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరాడు. రెడ్ బస్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న జయసూర్య మియాపూర్‌లో గురువారం రాత్రి 8 గంటలకు బస్సు ఎక్కాల్సి ఉండగా, ఇంటి వద్ద ఆలస్యం కావటంతో క్యాబ్ బుక్ చేసుకుని మూసాపేట్ వరకు వెళ్లి బస్సును అందుకున్నాడు.
జయసూర్యకు ఎల్ 16 నెంబరు సీటు కేటాయించారు. అర్ధరాత్రి కర్నూలు సమీపంలో బస్సులో మంటలు చెలరేగిన సందర్భంలో నిద్రలో ఉండగా ఆకస్మాత్తుగా అరుపులు విన్పించడంతో నిద్రలో నుంచి లేచే వరకు బస్సులో పొగ వాసన వస్తోంది. అప్పటికే తన ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు మంటలు అంటూ అరుస్తుండడంతో అప్రమత్తమై తన సీటు పక్కనే ఉన్న డోరు అద్దాలు అతి కష్టం మీద పగలగొట్టి అక్కడి నుంచి కిందకు దూకాడు. కిందకు దూకడంతో అతని కాళ్లు ప్యాక్చరయ్యాయి. అక్కడి నుంచి జయసూర్యతో పాటు మరో ఒకరిద్దరు సైతం కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సులో నుంచి కిందకు దూకి బస్సు వైపు చూస్తుండగానే నిముషాల్లోనే బస్సు పూర్తిగా కాలి బూడిదైనట్లు జయసూర్య తెలిపారు.
ప్రమాదం గురించి తెలుసుకోవగానే షాక్ గురయ్యాం.. వెనుక వైపు డోర్ అద్దాలు తమ తోటి ప్రయాణికులు పగలగొట్టడంతో అందులో నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాను. బస్సులో పొగ కమ్ముకోవడంతో బస్సు నుంచి కిందకు దిగగానే స్పృహా తప్పినట్లు అన్పించింది. అక్కడ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడిగి కర్నూల్‌కు చేరుకున్నాను, అక్కడ ఒక లాడ్జి తీసుకున్నాను. అయితే పొగ పీల్చడం వల్ల ఇబ్బంది పడుతుండడంతో పోలీసులు వెంటనే దవాఖానాలో చేరాలని సూచించడంతో కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చేరాను. నేను సురక్షితంగా ఉన్నాను. బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, కంపెనీ పనిమీదే బెంగుళూర్ వెళ్తున్నాని గుణసాయి తెలిపాడు. తనతోపాటు బహదూర్‌పల్లిలో బసెక్కిన సుబ్రమణ్యం, చింతల్లో బసెక్కిన వేణుల ఫోన్లు పనిచేయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
నేను బస్సు వెనుక సీట్లో ఉన్నా. సడెన్‌గా బస్సు ఆగిపోయింది. నిద్రలోంచి తేరుకుని చూస్తే ప్రయాణికులు అరుపులతో కిందికి దిగి వెళ్తున్నారు. వెంటనే నా పక్కనే ఉన్న తోటి ప్రయాణికుడు నన్ను తట్టి లేపాడు. ఆయన బయటకు దూకి నన్ను కూడా కిందకు లాగాడు. కింద పడిపోయిన నాకు కొద్దసేపటి దాకా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తేరుకుని చూసేసరికి బస్సంతా మంటలు వ్యాపించి పేలిన శబ్ధాలు వినిపిస్తున్నాయి. క్షణాల్లోనే బస్సంతా కాలిపోయింది. అక్కడి కింద ఉన్నవారంతా గాయాలతో ఏడుస్తున్నారు. కొంతమంది బస్సులోనే ఇరుక్కుని కాలిపోయారు. బతికి బయటపడ్డ వారందరినీ దవాఖానాలకు తరలించారు. నాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, డాక్టర్ల అనుమతితో హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చాను.
బస్సు ప్రమాదంలో హయత్‌నగర్, ఎల్లారెడ్డి కాలనీలో నివాసముంటున్న ఆందోజి నవీన్‌కుమార్(26) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద విషయం తెలుసుకున్న నవీన్‌కుమార్ తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన కర్నూలుకు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, జనగామకు చెందిన ఆందోజి కృష్ణమాచారి, కుటుంబ సభ్యులతో కలిసి హయత్‌నగర్, ఎల్లారెడ్డికాలనీలో నివాసముంటున్నారు. కృష్ణమాచారి వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతని రెండో కుమారుడు నవీన్‌కుమార్ బెంగుళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చిన నవీన్‌కుమార్ గురువారం రాత్రి 9 గంటలకు ఇంటి నుండి బయలుదేరి నాంపల్లిలో బెంగుళూరుకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కాడని కుటుంబ సభ్యులు తె లిపారు. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో నిద్రలో ఉన్న నవీన్‌కుమార్, ప్రమాదాన్ని తెలుసుకొని వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సు అద్దాలు పగలగొట్టి బయటికు దూకాడు. ఈ ఘటనలో అతని కాలుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ముషీరాబాద్, అక్టోబర్ 24: కర్నూల్ బస్సు ప్రమాద ఘటనలో స్వల్ప గాయాలతో విద్యానగర్‌కు చెందిన యశ్వజయంత్ మోహన్ బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే చాకచక్యంగా బస్సు కిటికి అద్దం పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. విద్యానగర్‌లోని లక్ష్మీ అపార్టుమెంట్లో నివాసముంటున్న యశ్వజయంత్ మోహన్ లక్డీకాపూల్‌లో బస్సు ఎక్కాడు. బస్సులోనుంచి బయటకు దూకే క్రమంలో ఎడమ కాలికి స్వల్ప గాయమైందని, పోలీసులు వైద్య చికిత్స చేయించి రాత్రి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. దైవ కృప వల్లనే తాను బతికి బయట పడ్డానని, తన కళ్ల ముందే తోటి ప్రయాణకులు ఆహుతి అవ్వడం కలచి వేసిందని తెలిపారు.
బస్సు ప్రమాదంలో కొందరు గాయాలతో బయటపడగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలకు గురైన వారికి ప్రాథమికి చికిత్స అనంతరం ఇండ్లకు పంపించారు. మరికొందరు దవాఖానాలోచికిత్స పొందుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డారు. పలువురు కర్నూల్ ప్రమాదం నుంచి బయటపడి తమ తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు.
మన్నెంపల్లి సత్యనారాయణ (27), సత్తుపల్లి, ఖమ్మం సరస్వతి హారిక(30), బెంగుళూర్ నెలకుర్తి రమేష్(36) స్వల్ప గాయాలు కాగా ఆయన భార్య శ్రీలక్ష్మి, పిల్లలు జస్విత, అభిరాలు సురక్షితంగా ఉన్నారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా
ముసలూరి శ్రీహర్ష(25), నెల్లూరు జిల్లా ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్.. హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు గుణ సాయి, తూర్పుగోదావరి జిల్లా శివా, బెంగుళూరు, గ్లోరియా ఎల్సా సామ్, బెంగుళూరు
చారిత్(21), బెంగుళూరు మెహమ్మద్ ఖిజర్(51), బెంగుళూరు డ్రైవర్లు: లక్ష్మయ్య, పల్నాడు జిల్లా, శివనారాయణ, ప్రకాశం జిల్లా