గచ్చిబౌలి నుంచి చార్మినార్ వరకు..
సైక్లింగ్ ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పోస్టర్ ఆవిష్కరణ
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైక్లిస్టు రెవల్యూషన్ పేరుతో ఈ నెల 27న నగరంలో భారీ సైక్లింగ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా చార్మినార్ వరకు సైక్లింగ్ రైడ్ సాగనుంది. అందులో భాగంగానే నగరానికి చెందిన హెచ్‌సీజీ గ్రూప్ ఫౌండర్ రవీందర్, నగర బైస్కిల్ మేయర్ సాంతన సెల్వన్ హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ పోస్టర్‌ను శుక్రవారం సుచిత్రలోని హెచ్‌సీజీ కార్యాలయంలో ఆవిష్కరించారు. సైక్లిస్టులందరూ రైడ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని వివరించారు. ఈ నెల 27 ఆదివారం జరగబోయే సైక్లింగ్ రైడ్ ఉదయం 6 గంటలకు ప్రారంభమై 10 గంటలకు పూర్తవుతుందని తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సైక్లింగ్‌లో పాల్గొనాలని చెప్పారు.