నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన లైంగికదాడి కేసులో సొంత తండ్రి రమావత్ రమేశ్ (30)కు 25 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత మంగళవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రాంరెడ్డి కథనం ప్రకారం.. నిందితుడు మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు, రెండో భార్య సంతానమైన ముగ్గురి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఓ రోజు రాత్రి సమయంలో అరుపులు వినపడంతో రెండో భార్య మేల్కొన్నది. తనపై తండ్రి లైంగికదాడికి పాల్పడినట్టు సవతి తల్లికి బాధితురాలు తెలిపింది.
గతంలో కూడా తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ బెదిరించినట్టు బాలిక చెప్పింది. స్థానికుల సహకారంతో బాధిత బాలికను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి.. ఫిర్యాదు చేశారు. 2022లో రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారి కె.రవికుమార్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు.. నేరం రుజువు కావడంతో శిక్షను ఖారారు చేసి, రూ.7 లక్షలు బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ కేసు విచారణకు అధికారులు టి.కల్పన, బి.లక్ష్మీనారాయణరెడ్డి, పి.నరేశ్‌రెడ్డి సహకరించారు.