నగరంలో ప్రజలకు 24 గంటల తాగునీరు అందించే విధంగా చూసే బాధ్యత తాను చూసుకుంటానని, సనత్‌నగర్‌లోనే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. మళ్లీ కేసీఆరే సీఎం అని స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి రాగానే నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. పొలిటికల్ టూరిస్టులను నమ్మొద్దని.. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. నగరంలో పోలింగ్ శాతం పెంచాలని, తలసానిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
– సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)/మారేడ్‌పల్లి
నగరంలో తాగునీటి సరఫరాకు నాదే బాధ్యత వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం.. మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పొలిటికల్ టూరిస్టులను నమ్మొద్దుఇంటింటికీ వెళ్లండి.. పోలింగ్ శాతం పెంచండి సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి కేటీఆర్.
సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, నవంబర్ 13: నగరంలో ప్రజలకు 24 గంటల తాగునీరు అందించే బాధ్యత తాను చూసుకుంటానని, సనత్‌నగర్‌లోనే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుల, మత విభేదాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే.. ప్రశాంతంగా రాష్ట్రం, నగరం ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ అని అన్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టి 70వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేశామని తెలిపారు. 30వేల ఇండ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. వైకుంఠధామాలను కూడా ఎంతో అభివృద్ధి చేశామని, పేదల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్స్‌ను కూడా నిర్మించుకున్నామని చెప్పారు. బేగంపేటలోని ముస్లింలు 40 ఏండ్ల నుంచి ఖబరస్తాన్కు స్థలం కేటాయించాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. పనుల కోసం రూ.3కోట్లు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం వైద్య సేవలను చేరువ చేయాలనే ఆలోచనతో నగరంలో 350లకు పైగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఆలోచనతో నగరం నలుమూలలా ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్థ్యంతో 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ వివరించారు. నిమ్స్‌లో కూడా రెండు వేల పడకలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, అలాగే ఉస్మానియాను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ లాంటి నాయకులు 50 మంది ఉంటే.. ఆ పార్టీకి ఎన్నికలంటే టెన్షన్ ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక ప్రణాళిక, ఒక వ్యూహంతో అందరిని కలుపుకొని పోయి పనిచేసే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ అని కొనియాడారు. తన కోసం కాలనీవాసులు, అపార్టుమెంట్ వాసులు పని చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ అంటుంటే సంతోషం కలిగిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రచారం చేయకుండా.. 365 రోజులు.. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ అని కేటీఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల నుంచి ఇద్దరం కలిసి పని చేస్తున్నామని, ఒక్కసారిగా కూడా వ్యక్తిగతంగా ఏ పని అడిగిన సందర్భం లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా మా నియోజకవర్గంలోనే చేపట్టాలని పట్టుబట్టే నాయకుడు తలసాని అని, ఇటువంటి నాయకుడు ఉండటం సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు.
ఏది ఉన్న ప్రజా సమస్యలు, పార్టీ అభివృద్ధి పైనే దృష్టి సారిస్తుంటారని వెల్లడించారు. ఆయా విభాగాల అధికారులందరిని కలుపుకొని పోయి అభివృద్ధి చేసే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మీలో ఒక్కడిగా ఉన్న నాయకుడు తలసాని అని, టూరిస్టు లెక్క ఆయా పార్టీల నాయకులు వస్తుంటారని, ప్రజలు ఎవరూ కూడా వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రాంతంలో ఒకాయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడని, ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరును మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా చేపట్టిన ఓటరు నమోదు, పోలింగ్ స్లిప్‌ల పంపిణీ, నూతన టెక్నాలజీని ఉపయోగించి అభ్యర్థి గుర్తు, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ చేస్తున్న ఎన్నికల ప్రచారం, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న తీరును సాయికిరణ్ వివరించారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సాయి కిరణ్ యాదవ్‌ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు.
ప్రతి వంద ఓటర్లకు ఒక వ్యక్తిని నియమించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాబోయే 16 రోజుల్లో ఒక్కొక్కరూ ఇంటింటికి కనీసం పది సార్లు వెళ్లి వారిని కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కలిసే విధంగా బూత్ కమిటీ సభ్యులు ప్రణాళికలు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజు హాలిడేగా భావిస్తారని, కాలనీలలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్లను కలిసేటప్పుడు కండ్ల ఎదురుగా కనిపించే అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించాలన్నారు. పోలింగ్ శాతం పెరిగేలా బూత్ కమిటీ సభ్యులు కాలనీలు, అపార్ట్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనాతో దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వం కోల్పోయిందని, దీంతో కొన్ని కార్యక్రమాలు చేసుకోలేకపోయామన్నారు. కరోనా సమయంలో అందరినీ జాగ్రత్తగా చూసుకున్నామని, సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను కంటి రెప్పలా కాపాడుకుంటున్నారని, తొమ్మిదిన్నరేళ్లలో ఏ చిన్న ఘటన జరగలేదన్నారు. ఒక్క సీఎం సీటు కోసం 400 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, కుర్చీ, పదవీ కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. కాంగ్రెస్‌లో ఆరు నెలలకోసారి సీఎం మారతాడని, పదవిపై ఆశ తప్పా.. అభివృద్ధి ఉండదని కేటీఆర్ చెప్పారు. ఇక బీజేపీకి అభివృద్ధి నమూనా ఉండదని, కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టి రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుంటారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు వస్తే ముస్లిం సోదరులు ర్యాలీలు వేరే రోజుకు మార్చుకుని హిందువులకు సహకరించడమే కాకుండా గణేశ్ నిమజ్జనం రోజు సేవ చేశారని, ఇది హైదరాబాద్ ప్రజల ఘనత అని అన్నారు. భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడానికి హైదరాబాద్ అభివృద్ధి కారణమని, హైదరాబాద్ నాశనమైతే తెలంగాణ నాశనమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల్లో పాజిటివ్ మోడ్ ఉందని కేటీఆర్ వివరించారు. కచ్చితంగా డిసెంబర్ 3న సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎప్పుడు, ఎక్కడా జరగలేదని సనత్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అందించిన సహకారంతోనే సనత్‌నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా, రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, వైకుంఠధామాల వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. అభివృద్ధిలో దేశంలోని ముఖ్యనగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందన్నారు.
ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో నాలాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి తలసాని తెలిపారు. గడిచిన 50 ఏండ్లలో జరగని అభివృద్ధి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో జరిగిందని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ అవసరమొచ్చినా..ఏ ఇబ్బంది కలిగినా తమకు పెద్ద దిక్కుగా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారనే భరోసాను కల్పించామన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను 32 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పార్టీకి, పార్టీ నాయకత్వానికి.. విధానాలకు కట్టుబడి అంకితభావంతో పనిచేస్తూ వచ్చానని తలసాని పేర్కొన్నారు. తనపై ఉన్న అభిమానంతో సిక్కులు, క్రిస్టియన్లు, ముస్లింలు, నార్త్ ఇండియన్స్, వివిధ వర్గాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, వారందరికీ మంత్రి తలసాని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీనియర్ నాయకుడు పీఎల్ శ్రీనివాస్, కార్పొరేటర్లు , బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.