GHMC | సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): స్వచ్ఛ హైదరాబాద్‌లో ‘కార్పొరేట్’ సంస్థలను భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే తరచు చెత్త వేసే ప్రాంతాల (గార్భేజి వుల్నేరబుల్ పాయింట్లు/జీవీపీ/ చెత్త నుంచి హాని కలిగించే పాయింట్ల)పై యాక్షన్ ప్లాన్‌పై రూపొందించి అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాల్లో తరచు చెత్త వేస్తున్నట్లు గుర్తించి వీటిని పూర్తి స్థాయిలో ఎత్తి వేసేలా చర్యలకు ఉపక్రమించారు.
ఈ జీవీపీ పాయింట్ల ఎత్తివేత విషయంలో ఇప్పటికే కాలనీలు, అసోసియేషన్ సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు స్వచ్ఛ హైదరాబాద్‌పై విస్తృత అవగాహన కల్పించారు. కొన్ని సందర్భాల్లో జీవీపీ వద్ద చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించారు. రాత్రి పూట కొనసాగే హోటళ్లు, ఇతర తిను బండారాల దుకాణదారులు, స్థానిక ప్రజలతో జీవీపీ గాడిలో పడటం లేదు. ఈ తరుణంలో జీవీపీ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24×7 నిఘా ఉంచాలని తాజాగా నిర్ణయించారు.
ఈ మేరకు స్వచ్ఛ హైదరాబాద్, జీవీపీ పాయింట్ల ఎత్తివేతపై ప్రత్యేకంగా కాలనీ, అసోసియేషన్ సంఘాలతో జోనల్ వారీగా సమావేశాలు జరిపారు. ఇక్కడే స్వచ్ఛ హైదరాబాద్‌లో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించి, ఈ మేరకు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్‌లో ఓ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా అన్ని జీవీపీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు.