మేడ్చల్, సెప్టెంబర్11(నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధితా జాబితాపై ఇంకా ప్రతిష్టంభన వీడటం లేదు. ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా రెవెన్యూశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన విషయం విధితమే. దీంతో బాధితుల తరపున బీఆర్ఎస్ పోరుబాట చేపట్టి ప్రభుత్వంపై నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను కాపాడేలా ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిషేధిత జాబితాను తొలగించేందుకు ఐఆర్జీఎస్కు సర్వే నెంబర్లను అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన విధంగా రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితా నుంచి తొలగించామని బాధితులుకు స్పష్టం చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రం ఇంకా నిషేధిత జాబితా నుంచి తొలగిపోనందున రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చేయడం కుదరదని బాధితులను తిప్పి పంపుతున్నారు. తమ ఆస్తులపై ఇంకా ప్రతిష్టంభన తొలగకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ఆప్‌లోడ్ చేసిన వివరాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాధితులకు చూపించి పంపిస్తున్నారు. అయితే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలలోకి వెళితే మీ ఆస్తులు ఇంకా నిషేధిత జాబితా నుంచి తొలగలేదని రిజిస్ట్రేషన్లకు మరింత సమయం పట్టే అవకాశం పడుతుందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమాధానంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని అడిగితే సమాధానం ఇవ్వకుండా సబ్‌రిజిస్ట్రార్ ఉద్యోగులు తప్పించుకుంటున్నారు. రెవెన్యూశాఖ అధికారులు నిషేధిత జాబితా నుంచి తొలగించనట్లు చెబుతున్నప్పటికీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది మాత్రం ఎందుకు కావాలనే రిజిస్ట్రేషన్లు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడం లేదని ఉద్యోగులను అడిగితే కొందరు దస్తావేజులేఖర్లను కలవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వారి దగ్గరికి వెళితే సమస్యను పరిష్కరించేలా చూస్తారని అధికారులే చేప్పడం విడ్డురంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈలాంటి సంఘటనలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులే రిజిస్ట్రేషన్లు జరగకుండా ఏదో ఒక సాకుతో తిప్పి పంపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆస్తులు క్రయ, విక్రయాలు జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
నేను ఇస్రో ఎంప్లాయిగా రిటైర్డ్ అయ్యాను. కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్ సర్వేనెంబర్ 145, 163/ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కలెక్టర్‌ను 4 సార్లు కలిసి మా కష్టాలు చెప్పుకున్నాం. కలెక్టర్ కూడా తాను ఏం చేయలేనని చెప్పాడు. సీఎంవో నుంచి ఏం చేయకూడదని ఆదేశాలున్నాయన్నారు. 1985లో మేం 15 ఎకరాలు కొన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. నిషేధిత భూముల్లో చేర్చడం వల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు న్యాయం చేయాలి. ఈ వయసులో భూముల గురించి తిరగాల్సి వస్తదని అనుకోలేదు. 2900 ఇండ్లకు సంబంధించిన సమస్య మాది.
– హనుమంతురావు, ఇస్రో రిటైర్డ్ ఎంప్లాయూకూకట్పల్లి
మాది కూకట్‌పల్లిలోని 140 సర్వే నెంబర్లో 220 ఎకరాలు. ఇందులో 7 కాలనీలున్నాయి. ఇందులో ఒక కాలనీ 33 ఎకరాల 33 గుంటలు. ఇప్పటికే మ్యుటేషన్ కూడా జరిగింది. ఈ కాపీని కలెక్టర్‌కు అందిస్తే చూసి అది పక్కకు పడేశాడు. మాకు 1980లోనే లే అవుట్ అయ్యాయి. 2008లో ఎల్ఆర్ఎస్ అన్ని చెల్లించి రెగ్యులరైజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. క్రయ, విక్రయాలు సజావుగా జరిగాయి. కానీ ఇప్పుడు 22ఏ పేరుతో మాపై భారం మోపారు. రిజిస్ట్రేషన్లన్నీ నిలిపివేశారు. కలెక్టర్‌ను కలిసినా ప్రయోజనం లేదు. లక్ష మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములున్నా లోన్ పెట్టుకునే పరిస్థితి లేదు. బ్యాంకు నుంచి అప్పుతెచ్చుకునే స్థితి లేదు. పిల్లల చదువులు ఏం కావాలి. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
– కృష్ణారెడ్డి
మాది ఎల్బీనగర్. 1974లో మా లే అవుట్ అయింది. సుమారు 70 ఎకరాలు. మేం ప్రాపర్టీ, ఎల్ఆర్ఎస్ లాంటి అన్ని పన్నులు చెల్లించాం. సుమారు 10వేల జనాభ ఉంది. ఇప్పుడు మా భూములన్నీ తీసుకెళ్లి 22ఏలో పెట్టారు. కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదు. అన్ని పన్నులు కట్టించుకుని ఇప్పుడు 22 ఏ అనడం ఏంటి? ధరణి ఉన్నప్పుడు మాకు ఎలాంటి సమస్యలు లేవు. భూ భారతీ వచ్చాక మా భూమికి నోటీసులు ఇచ్చారు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. మా పాప పెండ్లీ చెయ్యాలంటే కష్టంగా ఉంది. ఆత్మహత్య చేసుకోవడమే దారిలా కనిపిస్తుంది. మా బాధను పట్టించుకోవడం లేదు.
– సీతారాం రెడ్డి
మాది నాగోల్ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో 14 ఎకరాల భూమి. ఇది 1965లోనే ల్యాండ్ కన్వర్షన్ చేసి లే అవుట్ చేశారు. 1968లో మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అక్కడ్నుంచి అమ్మడం, కొనడం జరిగాయి. ఇందులో 85 శాతం వరకు ఇండ్లు, అపార్ట్మెంట్లు అయ్యాయి. మొత్తం 1200 జనాభ ఉంది. అప్పట్లో కోర్టు కేసు ఉన్నా, ప్రైవేట్ భూములు కాబట్టి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆ భూములకు జాతీయ బ్యాంకులు సైతం లోన్లు ఇచ్చాయి.. బీఆర్ఎస్ పాలనలో ఏ ఇబ్బంది కలగలేదు. 2022లో ఎస్బీఐలో మా అమ్మాయికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా 14 ఎకరాలు 22ఏలో పెట్టారు. కాలనీ వాసులందరూ భయపడుతున్నారు. కలెక్టర్‌ను కలిసినా పట్టించుకోవడం లేదు. తలలు వంచుకుంటున్నారే కానీ జవాబు చెప్పడం లేదు. మా ఒక్క కాలనే కాదు నాగోల్‌లో 12 కాలనీలు 22ఏలో పెట్టారు.
– గోపాల్ రావు
మాది గాజులరామారం. మాది 329/2, 329/10 వరకు మా సర్వే నెంబర్లో 140 ఎకరాల భూమి. 1960 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఇండ్లు, అపార్ట్మెంట్స్ అయ్యాయి. అందరం జీ ప్లస్ 2 నిర్మాణం కూడా చేసుకున్నాం. సుమారు 2500 మంది నివసిస్తున్నాం. ఇప్పుడు 22ఏ పేరుతో మేం కొనుగోలు చేసిన భమూలపై మాకు హక్కులు లేదని అంటున్నారు. గాజులరామారం మున్సిపల్ కార్యాలయం కూడా 22ఏలోనే ఉన్నదంటున్నారు. కొత్తగా ఇండ్లు కొనుగోలు చేసే వారికి ఎలాంటి అనుమతులు లేవంటున్నారు. ఉన్నవారు అమ్మడానికి హక్కు లేదంటున్నారు. ఇదెక్కడి పాలన. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
– బాలరాజు
మాది కుత్బుల్లాపూర్. పద్మనగర్ ఫేజ్ 1 సర్వే నెంబర్ 128, 1968లోనే 41 ఎకరాలతో లే అవుట్ జరిగింది. 2004లో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మా భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు. బీఆర్ఎస్ వచ్చాక సమస్య తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనొచ్చింది. మళ్లీ తీసుకెళ్లి 22ఏ పేరుతో నిషేధిత జాబితాలో పెట్టారు. కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా మాకు ఇబ్బందులు తప్పడం లేదు. మాకు న్యాయం చేయండి. మా ఎమ్మెల్యేను తీసుకెళ్లి అధికారులను అడిగితే ఆ సర్వేనెంబర్‌లోని కొంత భాగాన్ని జాబితా నుంచి తీసేశారు.
– సత్తిరెడ్డి
మా గ్రామంలో 1500 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంచారు. దాదాపు 3 వేల ఇండ్లు ప్రొబేషనరీలో ఉంచారు. ప్రజలంతా ఎమ్మార్వో, అధికారుల చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. ఎమ్మార్వో మాకు మార్చే అధికారం లేదంటున్నారు. కలెక్టర్ దగ్గరికి పోతే స్పందించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఇండ్లు, భూములు నిషేధిత జాబితాలో ఉంటే క్లియరెన్స్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా ఇండ్లు మొత్తం 22ఏలోకి మార్చారు. రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఎమ్మార్వో ఎన్వోసీ తీసుకురావాలంటున్నరు. ఎమ్మార్వోలు రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్చేస్తున్నారు.
– దాసు, అమీన్పూర్, పటాన్చెరు మండలం
కొండాపూర్ డెవలప్మెంట్ బ్లాక్‌లో 1985లో లే అవుట్ అయింది. మా కాలనీలో ఐదువేల ఇండ్లున్నాయి. వందల మంది ఇండ్లు కట్టుకున్నారు..అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి..ఎల్ఆర్ఎస్ చేస్తున్నారు. యూఎల్సీ ప్రకారం డబ్బులు కట్టారు. కమిషనర్ ధృవీకరించారు. కానీ ఈ మధ్య 22-ఏలో పెట్టారు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను కలిసి ఇది నిషేధిత భూమి కాదు కదా అని అడిగితే.. ‘సార్ మాకు ఎన్నో ఉంటాయి. పై వాళ్లకు ఇచ్చేది ఉంటది’ అన్నడు. ఒక్క ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ. 2లక్షల నుంచి రూ..5లక్షల దాకా వసూలు చేస్తున్నరు. ఎందుకని అడిగితే.. మీరు ఏ మినిస్టర్తోనో ఎవరితోనైనా చెప్పుకోండని అంటున్నడు.. ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు.. డబ్బులు ఇవ్వాల్సిందే అంటున్నరు.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యరాలేదు.
– వెంకటేశ్వర్రావు, కొండాపూర్ ( శేర్లింగంపల్లి)
నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు. అక్కడే ఇల్లు కొందామన్నాడు. అక్కడ ట్రంపు పెట్టే ఇబ్బందులకు నేనే అక్కడ వద్దని చెప్పిన. కానీ ఇక్కడ రేవంత్‌రెడ్డి ఆ ట్రంపు కంటే ఘోరంగా తయారైండు. భూములు కొందామన్నా అమ్ముదామన్నా రిజిస్ట్రేషన్లు కాట్లేవు. నా కొడుకు మాట వినకుండా ఇక్కడి ట్రంపును నమ్మి పటాన్చెరులో ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ కాట్లే. మరో తెలంగాణ ఉద్యమంలా పోరాటం చేయాల్సిందే. 1981లో శ్రీనగర్, శాంతినగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 2 వేల ప్లాట్లు ఉన్నాయి. 2025 నవంబర్లోఅగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.1.40 కోట్లు చెల్లించాను. రెండు సార్లు స్లాట్ బుక్ చేస్తే రిజెక్ట్ అయింది. మా రెండు కాలనీలు 22ఏలో చేర్చారు. 50 ఏండ్ల పహాణీలు కూడా ఉన్నాయి. అధికారులు మాత్రం నిజాం ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు.
– సంజీవరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు, పటాన్చెరు
మాది పటాన్ చెరు. సర్వేనెంబర్ 352 నుంచి 402 వరకు 50 ఎకరాల సమస్య. 2013లో మాకు అన్నీ అనుమతులు వచ్చాయి. 2016లో 955 విల్లాస్ నిర్మించుకున్నాం. అక్కడ 5వేల మంది జనాభ ఉంది. ఇప్పుడు మా గ్రేటర్ కమ్యూనిటీని 22ఏలో పెట్టారు. మాకు ఇప్పుడు ఎలాంటి లోన్లు రావడం లేదు. మా స్నేహితుడి కొడుక్కి యాక్సిడెంట్ అయితే మెడికల్ సదుపాయంలో భాగంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. నేను 6 సార్లు ఎమ్మార్వోను కలిశాను. మీ లైన్ వచ్చినప్పుడు ఆలోచిస్తామంటూ అధికారులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏదో విదేశీ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నాడంట. పీహెచ్డీ చదివే రేవంత్‌కు పిడికెడంతనైనా తెలివి ఉందా? ఏ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలో తెలియదా? ఇది కేవలం మీ కుటుంబ సభ్యుల స్వలాభం కోసం 22ఏ తెరమీదకు తెచ్చారు.
– యం. విజయరాజు