సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 8 కేంద్రాల్లో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు వెల్లడించారు. ఈనెల 14 నుంచే హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు అందుకు తగినట్టుగా టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లో అస్పష్టమైన ఫొటో ఉంటే అభ్యర్థి 3 పాస్ పోర్ట్ సైజు ఫొటోలను గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థి తమ గ్రూప్ -1 సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎంచుకున్న భాషలో అన్ని మెయిన్స్ పరీక్షలను (జనరల్ ఇంగ్లిష్ మినహా) రాయాలని, పరీక్షను ఎంచుకున్న భాషలో కాకుండా ఇతర భాషలో రాస్తే అటువంటి సమాధానాలు బుక్లెట్ మూల్యాంకణం చేయబడవని స్పష్టం చేశారు.