హాజరుకానున్న సీఎం కేసీఆర్, ప్రముఖులు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి క్రిస్మస్ వేడుకలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలు, విందు ఏర్పాట్లను సోమవారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. క్రిస్మస్ను పురసరించుకొని ప్రతి సంవత్సరం పేద క్రైస్తవులకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. క్రిస్టియన్ సంక్షేమ భవన్ నిర్మాణం, చర్చిలు, గ్రేవ్ యార్డ్ల అభివృద్ధిపై త్వరలోనే ఓ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్.ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎగ్గే మల్లేశం, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఆనంద్ గౌడ్ ఉన్నారు.