ముంపు ముప్పు తప్పేలా..

చంపాపేట, జనవరి 27 : గట్టిగా వర్షం పడితే ఇంట్లో ఉన్న వారు సైతం తడవక తప్పదు. ఎన్నో ఏండ్లుగా ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు ప్రత్యేక వరద నీటి కాలువతో విముక్తి లభించనున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సైతం సదరు కాలనీవాసులు ముంపుతో పోరాటం చేయకతప్పలేదు. చంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గాభవానీనగర్, ఎస్జీఆర్ కాలనీ, రాజిరెడ్డినగర్, రెడ్డికాలనీ తదితర కాలనీ వాసులకు ఈ సమస్య నుంచి త్వరలో విముక్తి లభించనున్నది. సంతోష్‌నగర్‌లోని భాష్యం పాఠశాల నుంచి రాజీరెడ్డినగర్, దుర్గాభవానీనగర్ కాలనీ మీదుగా ఎస్జీఆర్కాలనీ, రెడ్డికాలనీ వరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులు రూ.5.90 కోట్లతో వరద నీటి కాలువ (నాలా) పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తయితే పై కాలనీల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించిన డ్రైనేజీ పైప్‌లైన్‌తో భారీ వర్షం పడితే చాలూ.. వర్షం నీరు, మురుగునీరు పైపుల నుంచి బయటకు వచ్చి ఇండ్లలోకి ప్రవేశిస్తుంది. చంపాపేట్ సాగర్ రహదారి డీ మార్ట్ ముందు.. రెడ్డి కాలనీ వరకు పనులు జరుగాల్సి ఉండగా.. రోడ్డు కట్టింగ్‌తో కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు వరద నీటి కాలువ పనులు పూర్తయితే తమ ముంపు సమస్య పరిష్కారం అవుతుందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంగా ఉంది
గత కొంతకాలంగా ముంపు సమస్యతో బాధపడుతున్నాం. వరద నీటి కాలువ పనులు పూర్తికావడం ఆనందంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం మూడు సార్లు మా ఇంట్లోకి మొకాళ్లలోతు వర్షపు నీరు వచ్చింది. ముంపు సమస్య పరిష్కారమైంది. కానీ నాలా మీదుగానే సీసీరోడ్డు వేశారు. నాలాకు అటు, ఇటూ కేవలం మట్టిని పోస్తున్నారు. పూర్తిగా సీసీ వేస్తే సమస్య ఉండదు.- శివ, ఎస్జీఆర్ కాలనీవాసి
రెండువారాల్లో పూర్తి చేస్తాం
చంపాపేట్ డివిజన్లో చేపట్టిన వరద నీటి కాలువ పనులు మొత్తం 800మీటర్లు కాగా.. అందులో 20 మీటర్లు మాత్రమే చేయాల్సి ఉంది. పనులు తుదిదశలో ఉన్నాయి. రెండువారాల్లో ప్రజలకు నాలాను అందుబాటులోకి తీసుకువస్తాం. టెండర్లో ఉన్న ప్రక్రియతో పాటు ఎస్జీఆర్కాలనీ పెట్రోల్ పంప్ వద్ద ఉన్న రోడ్డును పూర్తిగా సీసీ వేసేందుకు నిధులు మంజూరు చేశాం. మిగిలిన నాలాకు అటూఇటూ మట్టితో చదును చేస్తాం.- కార్తీక్, ప్రాజెక్ట్ డీఈ