బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 00:17:01

వ్యామోహాల ఉచ్చులో కాపురాలు బలి

వ్యామోహాల ఉచ్చులో  కాపురాలు బలి

హత్యలకు దారితీస్తున్న వివాహేతర సంబంధాలు

 నైతిక విలువలు లోపిస్తున్నాయి..

సంస్కృతి, సంప్రదాయాలపై పట్టింపు లేదు..

తప్పు అని చెప్పే వాళ్లు లేక.. వాటి వైపే ఆకర్షణ

 తప్పుడు పనులతో జైళ్లోకి..

 తాత్కాలిక ఆనందం కోసం.. కుటుంబాలు నాశనం

 సమాజంలో నైతిక విలువలు లోపిస్తున్నాయి.. సంస్కృతి, సంప్రదాయాలపై అసలు పట్టింపు ఉండటం లేదు... చిన్నప్పటి నుంచే తప్పులకు పాల్పడుతున్నా.. అది తప్పు అని చెప్పేవాళ్లు లేక..వాటికే ఆకర్శితులవుతున్నారు.. ఈ క్రమంలో అనైతిక పనులకు పాల్పడు తూ తప్పుటడుగులు వేస్తున్నారు.. ఒక తప్పును సరిదిద్దు కోవడం కోసం.. తాము చేసిందే కరెక్ట్‌ అనుకొని.. మరిన్ని తప్పులు చేస్తున్నారు. కొందరు వ్యామోహాల మోజులోపడి కాపురాలు బలిచేసుకుంటున్నారు. తాత్కాలిక ఆనందం కోసం కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.  రోజుకు ఎక్కడో ఓ దగ్గర వివాహేతర సంబంధాలతో హత్యలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను... అనైతిక పనులకు అడ్డొస్తున్నారని కన్న పిల్లలను సైతం చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి, తమ విలువైన జీవితాలను జైల్లో గడిపేవారున్నారు. సమాజంలో జరుగుతున్న హత్యల్లో.. ఎక్కువగా వివాహేతర సంబంధాలతో జరిగేవే ఉంటున్నాయి.  చిన్ననాటి నుంచే క్రమ శిక్షణతో పెరిగేవారు జీవితంలో బాగుపడుతున్నారు...  క్రమ శిక్షణ లేనివారు జీవితంపై పట్టు తప్పుతున్నారు.  తాజాగా.. నగర శివారులో ఓ చిన్నారి హత్య ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనకు మూలం వివాహేతర సంబంధమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.         -  సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


  ఇటీవల జరిగిన కొన్ని వివాహేతర సంబంధ హత్య ఘటనలు..


 తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని...  ప్రియుడితో కలిసి రోడ్డు ప్రమాద రూపంలో భర్తను హత మార్చింది. అయితే.. పోలీసుల విచారణలో అది హత్యగా తేలింది. మేడ్చల్‌ పరిధిలో నివాసం ఉండే సురేశ్‌, బబితలు ఆరేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. బబిత సైదోనిగూడ తండాలో గ్రామవార్డు సభ్యురాలిగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రేమ్‌సింగ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండగా.. తెలిసిన భర్త వాళ్లను హెచ్చరించాడు. దీంతో భర్త సురేశ్‌ను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి బబిత సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నది. ఈ క్రమంలో గత నెల 23వ తేదీన బైక్‌పై వస్తుండగా సురేశ్‌ను డీసీఎంతో ఢీకొట్టి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసుల విచారణలో అది ప్రమాదం కాదని, వివాహేతర సంబంధంతో అది సుపారీ హత్య అని తేలడంతో నిందితులను మేడ్చల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ ఏడాది జనవరి నెలలో సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి.. ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అదే క్రమంలో ఆమె కూతురిపై కూడా లైంగిక దాడికి దిగడంతో విష యం తెలుసుకున్న బాధితురాలి బంధువులు అతడిని హతమార్చారు.

గత ఏడాది డిసెంబర్‌లో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహేతర సంబంధానికి ఏడేండ్ల కొడుకు అమ్జద్‌ అడ్డొస్తున్నాడని కన్న తల్లి సుల్తానబేగం చంపేసింది.

గత ఏడాది ఆగస్టులో శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శ్రీదేవి అనే మహిళ... ప్రియుడు శివతో కలిసి తమ వివాహేతర సంబంధానికి భర్త రామారావు అడ్డొస్తున్నాడని అతడిని హత మార్చింది. 


  సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహనలేకనే...

సమాజాన్ని ధర్మం నడిపిస్తున్నది... ఇది రోజు రోజుకు తగ్గిపోతున్నది. ఇందుకు ప్రధాన కారణాలు పిల్లలకు చిన్ననాటి నుంచే మన సంస్కృతి, సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఉండే విధంగా చేయకపోవడం... పిల్లలకు స్వాతంత్య్రం ఎక్కువ కావడం, తప్పు చేస్తున్న వారిని సరిదిద్దే ప్రయత్నం పెద్దలు చేయకపోవడం... దానికి తోడు నేడు సోషల్‌మీడియా వాడకం పెరగడం.. ఏది మంచి, ఏది చెడు అనే సన్నని గీతను ఏర్పాటు చేసుకోవడం.. వంటి కారణాలతో కొందరు తప్పుదోవ పడుతున్నారు. ఇలా.. ఎక్కడో ఓ తప్పు చేసి, దానిని తప్పించుకోవడం కోసం.. మరో పది తప్పులు చేస్తూ హంతకులుగా మారే పరిస్థితికి వస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా నడుచుకోవడంతోనే ఇలాంటి తాత్కాలిక ఆకర్షణలకు దూరంగా ఉండేందుకు అవకాశముంటుంది.                                           - ఎం.రమేశ్‌, ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ

  నైతిక విలువలు తగ్గుతున్నాయి...

మనిషిలో నైతిక విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. తమ కోరికలు, భావాలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. సునాయాసంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వంటి కారణాలతో తప్పుదోవ పడుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో తప్పు చెస్తే..అది తప్పు అని పెద్దలు అప్పుడే చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చిన్న కుటుంబమంటూ భార్య, భర్తలే ఉంటున్నారు. తప్పొప్పులు ఎత్తి చూపేవారే ఉండడం లేదు. ఏమి మంచి.. ఏదీ చెడు అనే విషయాలను పాఠశాలలు, కాలేజీల స్థాయి నుంచే నేర్పాల్సిన అవసరముంది. అలా చేయ డం వల్ల చిన్న నాటి నుంచి మంచి వైపు అడుగులు వేస్తారు. అప్పుడే సమాజం బాగుంటుంది. 

                   - రాధాకిషన్‌ రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ logo