శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:09:17

అతిముఖ్యమైన సేవలకు ప్రత్యేక పాసులు

అతిముఖ్యమైన సేవలకు ప్రత్యేక పాసులు

 • ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల స్టాఫ్‌..డయాగ్నస్టిక్‌ కేంద్రాల సిబ్బందికి ఐడీ కార్డులు చూపిస్తే పాసులిస్తారు
 • వంట గ్యాస్‌ బండ్లు నేరుగా వెళ్లొచ్చు 
 • పాల వాహనాలకూ అనుమతి 
 • కూరగాయల ఆటోలకు పాసులు
 • [email protected] కు అభ్యర్థన పంపొచ్చు
 • 9490616780 కు వాట్సాప్‌ చేయొచ్చు 
 • 24 గంటల పాటు పనిచేయనున్న హెల్ప్‌డెస్క్‌ 
 • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ 
 • అధిక ధరలకు సరుకులు అమ్మితే చర్యలు: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ 
 • రాచకొండలోనూ పాసులిస్తున్నాం: సీపీ మహేశ్‌ భగవత్‌ 

లాక్‌డౌన్‌ సందర్భంగా అతిముఖ్యమైన సేవలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు పాసులు అందజేస్తారు. పాసుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం [email protected], వాట్సాప్‌ 9490616780 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల స్టాఫ్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాల సిబ్బందికి ఐడీ కార్డులు చూపిస్తే పాసులిస్తారు. వంట గ్యాస్‌, మినరల్‌ వాటర్‌ సరఫరా చేసే వారిని నేరుగా అనుమతిస్తారు. నిత్యావసరాలను అందించే ఆయా సంస్థల అసోసియేషన్లతో నగర సీపీ అంజనీకుమార్‌ బుధవారం  నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోనూ అత్యవసర సేవలందించే వాహనాలకు పాసులు జారీ చేస్తామని కమిషనర్లు సజ్జనార్‌, హేశ్‌భగవత్‌ వెల్లడించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిత్యావసర సరుకుల  కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నగర సీపీ అంజనీకుమార్‌,  రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. బుధవారం నిత్యావసరాలను అందించే ఆయా సంస్థల అసోసియేషన్లతో నగర సీపీ సమావేశం నిర్వహించారు. పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఎల్పీజీ గ్యాస్‌, మాంసం ఉత్పత్తులు, ఫార్మసూటికల్స్‌, వైద్యం, కేబుల్‌ తదితర అసోసియేషన్‌ ప్రతినిధులు  హాజరయ్యారు. ప్రజలకు నిత్యవసర వస్తువుల విషయంలో మెరుగైన సేవలు అందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఆయా వ్యాపారుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పాలు, కూరగాయలు తదితర విషయాల్లో ప్రజలు మంత్రి కేటీఆర్‌, తదితరులకు మెసేజ్‌లు పెడుతున్నారన్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే పరిస్థితిని కల్పిస్తామని.. అందుకోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆహార ఉత్పత్తులు తరలించేవారు ఏ రూట్లలో అనుమతి కావాలో దరఖాస్తు చేస్తే పాస్‌లు ఇస్తామన్నారు. వస్తువుల సరఫరా, తయారీ విషయంలో తప్పని సరిగా తక్కువ మంది ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ‘కొందరు పాసులు తీసుకొని  దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల సైబరాబాద్‌లో ఇలానే దుర్వినియోగం చేశారన్నారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌.. వ్యాపారుల ఇబ్బందులు కూడా తెలుసుకొని, ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు మీ అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు చర్యలు తీసుకుంటారని అన్నారు. 

విధుల్లో 10వేల మంది పోలీసులు ..

 కరోనా కట్టడి కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని నగర సీపీ అంజనీకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లో 10 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా వ్యాపారులు, ఏజెన్సీలతో సమావేశమయ్యామన్నారు. ఇందులో 200 మంది పాల్గొన్నారన్నారు సమావేశం అనంతరం అందరికీ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. 

పాసులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

 నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి పాసులు జారీ చేస్తున్నామని సీపీ తెలిపారు.  ఇందుకోసం కమిషనరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా [email protected], వాట్సాప్‌ 9490616780 నంబర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల సౌకర్యం కోసం 900 పాసులు జారీ చేశామని, మరో 750 వ్యక్తిగత పాసులు జారీ చేశామన్నారు. మరో 700 పాసులు సిద్ధమవుతున్నాయన్నారు. పాసులు కావాల్సిన వాళ్లు ఆన్‌లైన్‌లో హెల్ప్‌డెస్క్‌ ఈమెయిల్‌, వాట్సాప్‌ నంబర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరూ కమిషనరేట్‌ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, అంతా ఆన్‌లైన్‌లోనే పాస్‌లు అందజేస్తామని తెలిపారు

అధిక ధరలకు అమ్మితే  చర్యలు :సజ్జనార్‌

సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్‌, కిరాణా, కూరగాయల దుకాణాలకు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ నేపధ్యంలో బుధవారం ఆయన నిత్యావసరాల విక్రయించే అన్ని  వర్గాలతో సమావేశమై  సమీక్షించారు. కలెక్టర్‌ అమయ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు అధిక ధరలు ఇతర అంశాలపై డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నెం. 9490617444కు సమాచారం అందించగలరని ఆయన కోరారు. అంతే కాకుండా నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయా వర్గాల వారు పాసుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించిన తర్వాత వాటిని జారీ చేస్తామన్నారు. 

ఇబ్బంది రానివ్వం : మహేశ్‌ భగవత్‌

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ:   నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.  బుధవారం  నేరేడ్‌మెట్‌ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిత్యావసరాలు సరఫరా చేసే అసోసియేషన్లు, మెడికల్‌ అసోసియేషన్‌, పండ్ల విక్రయదారుల సంఘం, పలు సంఘాలతో రాచకొండ సీపీ సమావేశమై పలు సూచనలు చేశారు.  అవసరమైన వారికి పాస్‌లు జారీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌కుమార్‌, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులను అందజేసే వారి అసోసియేషన్‌లతో కలిపి ఓ వాట్సాప్‌ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

పాస్‌లు ఇలా..

 • గుజరాత్‌ నుంచి పాలు, డెయిరీ ఉత్పత్తుల  లారీలను నగరంలోకి అనుమతిస్తారు.  తర్వాత వాటిని డిస్ట్రిబ్యూషన్‌ చేసే వాహనాలకూ పాసులు ఇస్తారు. ఈ కామర్స్‌ సంస్థలకు కూడా అత్యవసర వస్తువులు సరఫరా చేసేందుకు పాసులు మంజూరు చేస్తారు. వారు  ఏ రూట్లలో వెళ్లాలో  దరఖాస్తులో పొందుపరచాలి.  లగ్జరీ వస్తువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. 
 • ఈ కామర్స్‌ సంస్థల నిర్వాహకుల గోదాంల నుంచి నగరంలోకి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు, వ్యక్తులకు పాసులు అందిస్తారు. 
 • మార్కెట్లకు కూరగాయల లారీలను అనుమతిస్తారు. మార్కెట్‌ల నుంచి కూరగాయలను వివిధ కాలనీలకు సరఫరా చేసే ఆటోలనూ అనుమతిస్తారు. కూరగాయలతో వచ్చే లారీలు గ్రామాల నుంచి రాత్రి వేళల్లో నగరంలోకి వస్తాయి. వీళ్లకూ పాసులు అందిస్తారు. కూరగాయల మండీలలో సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలి. అలాగే ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే చేపల లారీలను కూడా  అనుమతిస్తారు.
 • పశువుల ఆహారానికి సంబంధించిన సరఫరా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
 • ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల సిబ్బందికి అనుమతి ఉంటుందని, వాళ్లు తమ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. మందులు సరఫరా చేసే వాహనాలకు అనుమతి ఉంటుంది. వారు క్లోజ్డ్‌ డోర్‌ ఉన్న వాహనాలను ఉపయోగించాలి.
 • వంట గ్యాస్‌ సరఫరా వాహనాలు, మినరల్‌ వాటర్‌ సరఫరా చేసే వారిని కూడా  అనుమతిస్తారు.
 • కిరాణా సామగ్రి సరఫరా చేసే వాహనాలకు అనుమతి ఉంటుంది. ప్రతి రోజు 40 చక్కెర లారీలు, 600 టన్నుల నూనెలు నగరానికి సరఫరా చేసే వాహనాలు తిరుగుతుంటాయి. వాటికి అనుమతి ఉంటుందని సీపీ తెలిపారు. బేగంబజార్‌, సిద్ధింబర్‌ బజార్‌, ముర్తియార్‌ గంజ్‌ ప్రాంతాల్లో వెయ్యి మంది హమాలీలు, 200 ట్రాలీలు తిరుగుతుంటాయని, వీళ్లకు పాసులు ఇస్తామని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.
 • కేబుల్‌ ఆపరేటర్లు, వారి వద్ద పనిచేసే టెక్నికల్‌ విభాగంలో పనిచేసే సిబ్బంది వ్యక్తిగతంగా పాసులు తీసుకోవాలి. అలాగే ఇంటర్నెట్‌ సర్విస్‌ ప్రొవైడర్లకు సంబంధించి సేవలు అందించేవారికి కూడా పాసులు జారీ చేస్తారు.
 • విద్యుత్‌ శాఖలో పనిచేసే సిబ్బందికి పాసులు అవసరం లేదు. అయితే ప్రైవేట్‌ వాహనాలపై తిరిగేవారు మాత్రం పాసులు తీసుకోవాలి.
 • సింగరేణి కాలరీస్‌లో పనిచేసే వారు ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది
 • బ్యాంకు అధికారులు,  ఏటీఎం వ్యవహారాలు చూసేవారు ఐడీ కార్డు చూపిస్తే  సరిపోతుంది.
 • రక్తదానం, అంత్యక్రియలు ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సంస్థలకు పాస్‌లు ఇస్తారు.
 • న్యూస్‌పేపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వాహనాలు ఆయా సంస్థ స్టిక్కర్లను ముందు అతికించుకోవాలి. ఆయా వాహనాలకు ఎలాంటి ఇబ్బందులుండవు. పేపరు డిస్ట్రిబ్యూట్‌ చేసే బాయ్స్‌ వద్ద పేపర్లు ఉంటే వాళ్లను ఎవరూ ఆపరు, మీడియాలో పనిచేసే సిబ్బంది గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది.
 • స్టార్‌ హోటళ్లలో పనిచేసే సిబ్బందికి పాస్‌లు జారీ చేస్తారు


logo