శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 00:54:21

‘గాంధీ’కి హోమ్‌ క్వారంటైన్స్‌ తరలింపు

‘గాంధీ’కి హోమ్‌ క్వారంటైన్స్‌ తరలింపు

సుల్తాన్‌బజార్‌:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏడుగురు కరోనా అనుమానితులను ఆదివారం అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని గాంధీ దవాఖానకు తరలించారు.ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఏడుగురు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడ కర్ఫ్యూలో భాగంగా బస్సులు నడవకపోవడంతో ఆటోను ఆశ్రయించి నగర శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అనుమానంతో ఆ ఏడుగురిని విచారించగా, వారి చేతులపై హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేసి ఉండటంతో తక్షణమే అప్రమత్తమై పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధీ దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా, ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు, ముగ్గురు నిజామాబాద్‌కు చెందిన వారు, ఒక్కరు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వీరి చేతిపై హోం క్వారంటైన్‌ స్టాంప్‌ ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అదుపులోకి...

తెలుగుయూనివర్సిటీ: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం కరోనా సోకిన అనుమానిత వ్యక్తి సంచరించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నాంపల్లి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మురాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ( 33) నైజీరియా దేశం లాగోస్‌ నుంచి అబుదబీ మీదుగా ముంబైకి విమానంలో శనివారం  వచ్చాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో వచ్చి ఆదివారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ ఫారం 2లో దిగాడు. ఆవ్యక్తి సోదరుడు హైదరాబాద్‌లో ఉన్నందున అతని ఇంటికి వెళ్లేందుకు గాను సిద్ధ్దమయ్యాడు. ఇంతలోనే అతని చేతికి ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది తనిఖీల అనంతరం వేసిన హోమ్‌క్వారంటైన్‌ స్టాంపును గమనించిన ఓ ప్రయాణికుడు  రైల్వే స్టేషన్‌లో భద్రతలో ఉన్న పోలీస్‌ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో  పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని చికిత్సల కోసం గాంధీ దవాఖానకు 108వాహనంలో తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను దిక్కరించిన ఆ వ్యక్తిపై నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును నాంపల్లి రైల్వే పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

ఫ్రాన్స్‌ నుంచి వచ్చి స్వచ్ఛందంగా గాంధీకి...

ఖైరతాబాద్‌:విదేశాల నుంచి వచ్చిన వారు తమకు తాముగా క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు కొందరు స్వయంగా వచ్చి రక్తనమూనాలు ఇస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్తుండగా, విదేశాల నుంచి వచ్చి ఎలాంటి లక్షణాలు లేకున్నా రక్తనమూనాలు ఇచ్చి ఇంటి వద్ద హోం క్వారంటైన్‌ అవుతున్నారు. కాగా నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫ్రాన్స్‌ నుంచి రాగా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతుండగా వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఖైరతాబాద్‌ మీదుగా గాంధీ దవాఖానకు వెళ్లాడు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో.. 

మారేడ్‌పల్లి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కరోనా వైరస్‌ అనుమానితురాలిని రైల్వే పోలీసులు, రైల్వే వైద్యులు అదుపులోకి తీసుకొని నగరంలోని బంధువుల ఇంటికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం...దుబాయి నుంచి ఓ యువతి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ వైద్యులు ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి చేతికి హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు.  కానీ ఆ యువతి ఆదివారం ఉదయం క్యాబ్‌లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లడానికి ఎస్‌-4 కోచ్‌లో ఎక్కింది. సీట్లో కూర్చున్న అనంతరం పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఆ యువతి చేతికి ఉన్న స్టాంప్‌ను గమనించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని రైలు దింపివేశారు. అనంతరం కూకట్‌పల్లిలోని ఉన్న కుటుంబ సభ్యుల ఇంటికి పంపించి వేశారు.

 ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలో..

చర్లపల్లి: కరోనా లక్షణాలు ఉన్న అనుమానితుడిని గాంధీ వైద్యశాలకు తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి వరంగల్‌కు వచ్చాడు. రెండు రోజుల క్రీతం ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో నివాసముండే తన మామ ఇంటికి చేరుకున్నాడు.  దీంతో అతను దగ్గు, జలుబుతో బాధపడుతుండగా స్థానికులు గమనించి వెంటనే  పోలీసులు, సర్కిల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే టీఎస్‌ఐఐసీ కాలనీకి చేరుకొని అతన్ని పరీక్షల నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. 


logo