శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 08, 2020 , 00:26:40

‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌'కు బీజం

‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌'కు బీజం

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహిళలకు స్వయం ఉపాధి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ సంకల్పానికి బీజం పడుతుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానంపై కేరళ, నిథమ్‌లో శిక్షణ పొందిన ఇద్దరు మహిళలకు ప్రప్రథమంగా పైలెట్‌ ప్రాజెక్టు కింద మేడ్చల్‌ జిల్లాలో క్యాటరింగ్‌, క్యాంటీన్‌ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సెర్ఫ్‌, జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి రావడంతో త్వరలోనే ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్యాటరింగ్‌, క్యాంటీన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గతంలో మేడ్చల్‌ జిల్లా నుంచి ఐదుగురు మహిళలను ఎంపిక చేసి శిక్షణకు పంపారు. ఇందులో మేడ్చల్‌ మండలానికి చెందిన కె.మంజూల, ఘట్‌కేసర్‌ మండలానికి చెందిన కృష్ణవేణి శిక్షణను పూర్తి చేసుకొని యూనిట్‌లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు.


ఈ క్రమంలో ఇరువురు మహిళలు కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు వద్ద, మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద క్యాంటీన్‌, క్యాటరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు గాను జిల్లా సెర్ఫ్‌ ఆదేశాలు, కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీరికి మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్య నుంచి యూనిట్‌ విలువలో సుమారు రూ.90శాతం రుణం ఇప్పించడం జరుగుతుందని, అలాగే 10శాతం యూనిట్‌ నిర్వాహకులు భరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా మేడ్చల్‌ జిల్లాలో వీటిని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయడం జరుగుతుందని, మంచి ఫలితాలు వస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు.    


logo