శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 26, 2020 , 00:56:49

నిథిమ్‌.. అధునాతనం

నిథిమ్‌.. అధునాతనం

గొడుగు శ్రీనివాస్‌ (శేరిలింగంపల్లి)

గచ్చిబౌలిలోని నిథిమ్‌ లైబ్రరీ.. నూతన సాంకేతికతో ఆదర్శంగా నిలుస్తున్నది.  విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడంలో సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకొని వినూత్న సేవలందిస్తుంది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథిమ్‌) సంస్థలోని లైబ్రరీ నగరంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. పర్యాటక, ఆతిథ్యరంగంలో కోర్సులు, శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో  2005 మార్చి 16న నిథిమ్‌ అందుబాటులోకి వచ్చింది. నిథిమ్‌లో నాడు ఏర్పాటైన ఈ లైబ్రరీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సేవలు విస్తృతపరుస్తుంది. గ్రంథాలయాల్లోనే వినియోగించే అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ)ను వినియోగిస్తున్న విద్యాసంస్థగా నిథిమ్‌ గుర్తింపు పొందింది. 


పుస్తకంలో చిప్‌..

 గ్రంథాలయంలో పుస్తకాలు చోరీ కాకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అనుమతి లేకుండా పుస్తకాలు తీసేకెళ్తే ప్రధాన ద్వారం దాటే ప్రయత్నంలోనే అప్రమత్తం చేస్తుంది.  పుస్తకంలో చిప్‌ అమర్చి ఆటేమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ డాటా క్యాప్చర్‌ (ఏఐడీసీ) అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు. సదరు ఎలక్రానిక్‌ టాగ్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ద్వారా పుస్తకాలకు సంబంధించిన సమాచారం లైబ్రేరియన్‌ వద్ద అందుబాటులో ఉంటుంది.


అత్యాధునిక సౌకర్యాలు... 

నిథిమ్‌ లైబ్రరీని 2006లో ఆధునీకరించడంలో భాగంగా ఆటోమేషన్‌ ఆఫ్‌ లైబ్రరీలో లిబ్‌ సైస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ప్రారంభించారు. ఆ తర్వాత సోహా ఓపెన్‌ సోర్స్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ చేశారు. దీంతో పాటు 2016లో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌ఐడీ సెక్యూరిటీ గేట్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్‌, సెల్ఫ్‌ చెక్‌ ఇన్‌/ఔట్‌ కియోక్స్‌, రెప్రోగ్రఫీ ఫెసిలిటీ, మల్టీమీడియా ఫెసిలిటీ, ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌ కంప్యూటర్స్‌, నాన్‌-బుక్‌ మెటీరియల్‌ మ్యాప్స్‌, సీడీ రోమ్స్‌, డీవీడీలు, వైఫై ఫెసిలిటీ, నిథిమ్‌ ఈ-న్యూస్‌లెటర్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే గ్రంథాలయంలో నూతనంగా ఆన్‌లైన్‌ పబ్లిక్‌ యాక్సెస్‌ కేటలాగ్‌, లైబ్రరీ కేటలాగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 


బయోమెట్రిక్‌తో సెల్ఫ్‌చెక్‌.. 

నిథిమ్‌లో  బయోమెట్రిక్‌ విధానం ద్వారా సెల్ఫ్‌ చెక్‌ వ్యవస్థను అమలు చేస్తున్నాం. ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతికతను వినియోగించడం ద్వారా పనిచేయడం ఎంతో సులువుగా మారింది. గ్రంథాలయాన్ని మరింత పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

- యాదగిరి, నిథిమ్‌ లైబ్రేరియన్‌ 


మెరుగైన సేవలే లక్ష్యం 

విద్యార్థులకు మెరుగైన సేవలందించేంచేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ లైబ్రరీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. డీ స్పేస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి పుస్తకాలు, ఇతర వాటిని డిజిటలైజ్‌ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. 

- డాక్టర్‌ ఎస్‌.చిన్నంరెడ్డి, నిథిమ్‌ డైరెక్టర్‌ 


logo