Hyderabad | సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): మల్టీలెవల్ మార్కెట్‌తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్‌కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలను వెల్లడించారు.
ఢిల్లీకి చెందిన పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ సంస్థకు అదే ప్రాంతానికి చెందిన రియాజుద్దీన్ అలియాస్ రియాజ్ అహ్మద్, షకీల్, పూజాకుమారి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లు, పర్ఫెక్ట్ బజార్లు, ఐడీ స్కీమ్‌ల పేరుతో మూడు వేర్వేరు స్కీమ్‌లు తయారు చేశారు. ఈ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టాలంటూ హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు సమావేశాలు నిర్వహించి, ఆకట్టుకున్నారు. ఐడీ స్కీమ్‌లో రూ. 9999 పెట్టుబడిపెడితే.. 36 నెలలపాటు రూ. 880 తిరిగి చెల్లిస్తారు. దీంతో పాటు హెర్బల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉంటాయి. పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్స్‌కు రూ. 6 లక్షలు పెట్టుబడిగా పెడితే 30 నెలల పాటు రూ. 30 వేల చొప్పున అందిస్తారు. ఈ స్టోర్‌లో అమ్మే విక్రయాలపై 5 శాతం కమీషన్ ఇస్తారు.
పర్ఫెక్ట్ బజార్లో రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెడితే.. 30 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు, విక్రయాలపై 3 నుంచి 5 శాతం కమీషన్ ఇచ్చే విధంగా ఈ స్కీమ్‌లను నిర్వహించారు. ఈ స్కీమ్‌లలో చేరిన వారు మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా చేరిన వారు ఇంకొందరిని చేర్పిస్తూ వెళ్లాలి. ఇలా చేర్పిస్తే ప్రత్యేకంగా కమీషన్ ఇస్తారు. ఎక్కువగా సభ్యులను చేర్పించిన వారికి టూర్లు, ల్యాప్‌టాప్, బంగారు ఆభరణాలు, బైక్‌లు, కార్లు, ఫ్లాట్లను గిఫ్టుగా ఇచ్చే విధంగా ఆఫర్లు రూపొందించారు.
గొలుసు కట్టు విధానంతో..
గొలుసు కట్టు విధానంలో ఉన్న ఈ స్కీమ్‌లలో భారీగా చేరి వేలాది మంది పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాలలో తమ కార్యాలయాలను ప్రారంభించి, 6000 నుంచి 7000 మందిని సభ్యులుగా చేర్చుకొని.. సభ్యుల వద్ద నుంచి రూ. 200 కోట్ల వరకు వసూలు చేశారు. హైదరాబాద్‌లో ఈ ముఠా కాటేదాన్, శాలిబండ, దారుసలాం, మల్కాజిగిరి, సీతాఫల్మండి ప్రాంతాల్లో పర్ఫెక్ట్ బజార్లను తెరిచి.. కేఎల్కే బిల్డింగ్‌లో కార్యాలయాన్ని ఏప్రిల్, 2022లో ప్రారంభించింది.
ఇలా బయటపడింది..
ఇదిలా ఉండగా.. మూడు నెలల కిందట సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఘటన నేపథ్యంలో క్యూనెట్ నిర్వహించిన మల్టీలెవల్ మార్కెటింగ్ దందా బయటపడింది. దీనిపై బాధితులిచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్ చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ అనేది అక్రమమని, ఇలాంటి స్కీమ్‌ల్లోకి ఎవరూ వెళ్లవద్దంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో హెర్బల్ కేర్ ప్రాడక్ట్స్ విషయంలో జరుగుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ దందాపై నగరానికి చెందిన అంజాద్ ఖాన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ సారథ్యంలో సీసీఎస్ డీసీపీ శబరీష్ మల్టీలెవల్ మార్కెటింగ్ ముఠాలను కూకటివేళ్లతో ఏరివేసే విధంగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో ఈ ముఠా వ్యవహారాలను ఆరా తీసిన సీసీఎస్ పోలీసులు ప్రధాన నిందితుడు రిజాయుద్దీన్తో పాటు పూజాకుమారిని అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. ఈ ముఠాపై పలు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు.
బాబీ చౌదరీ @ రూ. 12 కోట్లు
‘బోర్డు లగావో-పైసా కమావో’ అంటూ తమ స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే నెలవారీగా మంచి లాభాలిస్తానంటూ నమ్మిస్తూ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్, గజియాబాద్‌కు చెందిన బాబీ చౌదరీ అలియాస్ ఎజాజ్ అహ్మద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై యూపీలో మూడు కేసులున్నాయి. తెలంగాణ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ మోసగాడిని మొదటిసారి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుడు మేజోన్ ఈ-మార్ట్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. సూపర్ మార్కెట్లలో రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే.. 40 నెలల పాటు నెలకు రూ. 1.2 లక్షలు, ఐడీ స్కీమ్‌లో రూ. 12 వేలు పెట్టుబడి పెడితే.. 38 నెలల పాటు నెలకు వెయ్యి రూపాయలు తిరిగి చెల్లించడంతో పాటు, ఆయా సూపర్మార్కెట్లలో విక్రయించే ఉత్పత్తులపై 35 శాతం డిస్కౌంట్ ఇచ్చే విధంగా స్కీమ్‌లు తయారు చేశాడు. హైదరాబాద్, గజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్, జైపూర్, డెహరడూన్ తదితర ప్రాంతాలలో తమ కార్యాలయాలను ప్రారంభించాడు. ఈ స్కీమ్‌లలో 200 మంది కస్టమర్లు రూ.12 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టగా, హైదరాబాద్‌కు చెందిన వారు రూ. 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో అమాయకులకు భారీ వడ్డీలు, లాభాల ఆశ చూపి పెట్టుబడులు పెట్టిస్తున్న బాబీ చౌదరీ మోసాలపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.