Cyber Crime | సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మూడు రాష్ర్టాల్లో.. ఆరు బృందాలతో సైబర్ నేరగాళ్ల కోసం గాలించి.. 18 మంది నేరస్థులను అరెస్ట్ చేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు సైబర్నేరాలలో మాస్టర్ మైండ్ ఉన్నవారని, రూ. 6.94 కోట్ల ఆర్థిక నష్టం జరిగిన 10 ప్రధాన కేసులను సైబర్‌క్రైమ్ యూనిట్ ఛేదించిందని తెలిపారు. ఇందులో 6 ఇన్విస్ట్మెంట్, ఒకటి డిజిటల్ ఫ్రాడ్ అరెస్ట్, మరొకటి సెక్ట్సార్షన్ మోసం, ఓటీపీ ఫ్రాడ్‌తో పాటు మరో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసును కూడా ఛేదించామని తెలిపారు. సైబర్‌క్రైమ్స్ డీసీపీ దార కవిత పర్యవేక్షణలో ఏసీపీలు శివమారుతి, చాంద్‌పాష నేతృత్వంలోని ఇన్స్పెక్టర్లు మట్టం రాజు, ప్రమోద్‌కుమార్, సీతారాములు, కె.ప్రసాద్‌రావు, ఎస్.నరేశ్ బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో సైబర్‌నేరగాళ్ల కోసం గాలింపు చేపట్టి.. 18 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు.